Pet Dog Attack On Delivery Boy In Hyderabad : ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా కుక్కల గోల బాగా ఎక్కువైపోయింది. ఎటు చూసిన కుక్కల దాడిలో చనిపోయిన చిన్నారులు.. కుక్క కరవడంతో తీవ్రగాయాలైన వ్యక్తి అనే వార్తలు ఎక్కువగా వింటున్నాము. అయితే ఇప్పుడు చెప్పేవన్నీ వీధికుక్కలు దాడిలో చనిపోయిన, గాయపడిన వారి గురించి మాత్రమే.. అయితే పెంపుడు కుక్కలు కరవవా అనే ప్రశ్న మీలో తలెత్తొచ్చు. దానికి అవుననే సమాధానం కూడా వస్తోంది. పెంపుడు కుక్క కరవకుండానే దానికి అరుపుకే బిల్డింగ్‌పై నుంచి దూకేసిన.. ఆ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో పంచవటి కాలనీలోని శ్రీనిధి హైట్స్ అపార్టుమెంట్లో మూడో అంతస్తులో ఉన్న ఇంటి యజమానికి ఆర్డర్‌ని డెలివరీ ఇవ్వడానికి డెలివరీ బాయ్ ఇలియాజ్ అక్కడకు వెళతాడు. ఇంతలోనే ఆ ఇంటి యజమాని పెంపుడు కుక్క ఒక్కసారిగా అరవడంతో.. అది తనపైకి రావడంతో ఆ బాయ్ భయంతో మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఇంకేముంది డెలివరీ బాయ్‌కు తీవ్రగాయాలైయ్యాయి. వెంటనే అక్కడి ఉన్న ఇంటి యజమాని, స్థానికులు స్పందించి.. అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన అతడిని మెహిదీపట్నంలోని ఒయాసిస్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రమేద్ తెలిపారు.
అపార్టుమెంటు వాసులు తగిన చర్యలు తీసుకోవాలి : అయితే పెంపుడు కుక్కల దాడిలో వ్యక్తులు గాయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు ప్లాట్లలో పెంపుడు కుక్కలు పెంచేవారు.. తగిన జాగ్రత్తలతో చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. అయినా సరే పెంపుడు కుక్కల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ఇలాంటి ఘటనలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
బంజారాహిల్స్‌లో ఇదే రిపీట్.. స్విగ్గీ బాయ్ మృతి : ఇటీవల బంజారాహిల్స్‌లోని యూసఫ్‌గూడలో సైతం ఇలా పెంపుడు కుక్కల దాడిలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. మహ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి మూడేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తూ ఉండేవాడు. బంజారాహిల్స్ రోడ్ నంబరు 6లోని లుంబిని రాక్ క్యాసిల్ అపార్ట్మెంట్లో ఆర్డర్ డెలివరి ఇచ్చేందుకు వెళ్లి.. తలుపు తట్టగానే ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క మొరుగుతూ.. తనిపైకి వచ్చింది. వెంటనే అతను భయపడి మూడో అంతస్తు నుంచి కిందకి దూకాడు. తీవ్రగాయాలైన అతడిని ఇంటి యజమాని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చేరిన అతడు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు.
ఇవీ చదవండి :