దళితబంధు పథకాన్ని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. దళితబంధుపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి హాజరైన భట్టి.. గిరిజనులకూ ఈ తరహా పథకం తీసుకురావాలని కోరినట్లు వెల్లడించారు. ఇతర వర్గాల్లోని పేదలకు కూడా పథకం తీసుకురావాలని.. గత హామీల లాగా దళితబంధు మిగిలిపోవద్దని ముఖ్యమంత్రిని కోరినట్లు స్పష్టం చేశారు.
ఇంతమంచి పథకం ఎవరూ పెట్టలేదు..
ఇప్పటి వరకు తాను ఎంతోమంది సీఎంలను చూశానని.. దళితుల కోసం ఇంతమంచి పథకం ఎవరూ పెట్టలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వాలు దళితులకు భిక్షం వేసినట్లుగా చిన్న చిన్న పథకాలు అమలు చేశాయని.. ఒకేసారి రూ.10 లక్షలు ఎవ్వరూ ఇవ్వలేదని తెలిపారు. దళితబంధు ప్రేమ బంధు అన్న ఆయన.. ఒక చరిత్రకారుడు మాత్రమే ఇలాంటివి చేయగలుగుతారన్నారు. ఆ చరిత్రకారుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ నిర్వహించిన దళితబంధు సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈ దళితబంధు పథకం దళితులకు అంటరానితనం నుంచి విముక్తి కలిగించడంతో పాటు ఆర్థిక దరిద్రం నుంచి బయటపడేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి పథకాల వల్ల అంబేడ్కర్ ఆశయం నెరవేరుతుందనే విశ్వాసం కలుగుతుందన్న ఆయన.. దళితబంధు పథకం దేశంలోనే ఒక సంచలనాన్ని సృష్టిస్తుందన్నారు.
ఇదీ చూడండి: CM KCR REVIEW: 'వచ్చే ఏడాది నుంచి బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు'