ఏ అభాగ్యురాలికి పుట్టాడో తెలీదు గాని ఓ రెండేళ్ల బాలుడు అంగట్లో వస్తువు అయ్యాడు. తల్లి పాలకోసం తల్లడిల్లే వయసులో బేరగాళ్లకు ఆస్తిగా... పిల్లలు లేని జంటకు బిడ్డగా మారబోయాడు. హైదరాబాద్ ఎస్ఆర్నగర్లో రెండేళ్ల బాలుడిని ఇద్దరు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విక్రయిస్తున్న వారిని... కొనుగోలు చేస్తున్న వారిని అరెస్టు చేశారు.
అసలు ఏమి జరిగిందంటే...
కాచిగూడకు చెందిన కృష్ణ, కవిత దంపతులకు పిల్లలు లేకపోవడం వల్ల బిడ్డకోసం అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రవి అనే వ్యక్తి ద్వారా ఓ బిడ్డ అమ్మకానికి ఉన్నాడని తెలిసి వెళ్లారు. రూ. 50 వేలు చెల్లించి బిడ్డను దక్కించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. విషయం బయటకొచ్చి పోలీసులకు చిక్కారు.
బిడ్డను విక్రయానికి పెట్టిన బోరబండకు చెందిన మహేశ్వరి, పరశురామ్‌లు తమకు పిల్లాడు మూసాపేటలోని కూరగాయల మార్కెట్లో దొరికినట్లు చెబుతున్నారు. బిడ్డను అమ్ముతున్న, కొనడానికొచ్చిన... మధ్యవర్తిత్వం జరిపిన అయిదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని... పిల్లాడిని శిశు విహార్‌కు తరలించారు.