నారాయణ పేట జిల్లా మరికల్ భూములపై గ్రామస్తులకు పూర్తి హక్కులు ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాభై ఏళ్ల క్రితం ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూములను లాక్కోవడం అన్యాయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భూ సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నష్టపరిహారం చెల్లించాలి : తమ్మినేని వీరభద్రం
పశు వైద్య విశ్వవిద్యాలయం కోసం పరిహారం ఇవ్వకుండా భూమిని తీసుకోవడం సమంజసం కాదని తమ్మినేని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పేర్కొన్నారు. ఒకవేళ భూమిని తీసుకుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఐక్య కార్యాచరణ పోరాటాలతో ముందుకు సాగనున్నట్లు ఆయన తెలిపారు. బాధితులకు అన్ని విధాలుగా సీపీఎం అండగా ఉంటుందన్నారు.
బాధితుల పక్షాన పోరాడుతాం : ఎల్.రమణ
యాభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల పరిరక్షణకు అఖిలపక్షం కృషి చేస్తుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. సుదీర్ఘకాలంగా సాగు చేస్తున్న భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో బాధితుల పక్షాన పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిఘటిస్తాం : ఆర్.కృష్ణయ్య
మరికల్ భూ బాధితులు ఒక్క అంగుళం భూమిని వదులుకోరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. కొంతమంది భూములు ఆక్రమించాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలని ఆయన అన్నారు. పేదల భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. కేసులకు బయపడద్దని ఆయన భరోసా కల్పించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు మీకు అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేతో మాట్లాడుతామని కృష్ణయ్య పేర్కొన్నారు.
బెదిరిస్తున్నారు : బాధితులు
తమ పూర్వీకులు సాగు చేసుకున్న భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మార్వోలు బెదిరిస్తున్నారని మరికల్ భూ బాధితులు ఆరోపించారు. భూమి సాగు చేసుకుంటున్నప్పటికీ పంటను నాశనం చేసి భయాందోళనకు గురి చేస్తున్నారని వాపోయారు. తమ భూములు లాక్కోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మరికల్ భూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.