Covid Vaccine: ఏ టీకా అయినా రెండు డోసులు తీసుకున్న ఆర్నెల్ల తర్వాత తప్పనిసరిగా బూస్టర్ డోసు (మూడోడోసు) వేసుకోవాలని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి (Aig Chairman Nageshwarareddy) స్పష్టం చేశారు. రెండుడోసులు ఇచ్చే ప్రక్రియను ఒకవైపు కొనసాగిస్తూనే.. బూస్టర్ డోసును ప్రారంభించాలని సూచించారు. అలా అయితేనే భారత్‌లో మూడోదశ (Third Wave) ఉధ్ధృతిని నివారించవచ్చని తేల్చి చెప్పారు. మన దగ్గర ఇప్పటికీ డెల్టా కేసులే ఎక్కువగా వస్తున్నాయనీ, ఎక్కువగా జనాలు గుమిగూడిన సందర్భాల్లో వ్యాప్తి చెందిన కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. రెండు డోసుల టీకా పొందినా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దనీ, సత్వరమే పరీక్ష చేయించుకొని అవసరమైన చికిత్స పొందాలని సూచించారు. యూరప్ దేశాల్లో కేసులు మళ్లీ విజృంభించడం.. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈటీవీ భారత్ ముఖాముఖిలో ఆయన పలు అంశాలను వివరించారు.
యూరప్ దేశాల్లో కొవిడ్ విజృంభిస్తోంది.. ఇది మన దగ్గర మూడోదశ ఉధ్ధృతికి ముందస్తు ప్రమాద ఘంటికా?
యూరప్ దేశాల్లో చలి వాతావరణం ఉండడంతో వైరస్ వ్యాప్తి ఒక కారణం కాగా.. అక్కడ 30 శాతం మంది ప్రజలు టీకా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. అందుకే ఆ పరిస్థితి నెలకొంది. భారత్‌లో రెండోదశ ఉద్ధృృతి సమయానికి టీకాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. కానీ ఇప్పుడు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అలా అని అతి విశ్వాసంతో ఉండకూడదు. కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినా, దక్షిణాఫ్రికా వేరియంట్ వచ్చినా.. ఆ ప్రభావం మనపై ఉండకూడదనుకుంటే అందరూ తప్పనిసరిగా రెండుడోసులు వేసుకోవాలి. కొవిషీల్డ్ టీకా వ్యవధిని 84 రోజుల నుంచి తగ్గించాలి. కొవాగ్జిన్ గానీ, కొవిషీల్డ్ గానీ 28 రోజుల వ్యవధి చాలు. 6 నెలల వ్యవధి అనంతరం బూస్టర్ డోసు తీసుకోవాలి. మూడో డోసు ద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకురాకుండా అడ్డుకోవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా బూస్టర్ డోసును సిఫార్సు చేయలేదు కదా?
ప్రపంచంలోని అందరికీ రెండుడోసులు పూర్తయ్యే వరకూ ఇవ్వకూడదనే నియమంలో భాగంగానే బూస్టర్‌డోసుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాట్లాడడం లేదు. అయితే అమెరికా, యూకే వంటి దేశాలు డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలను పాటించడం లేదు. తమ పౌరులకు ఏది లాభం చేకూరుతుందో అదే చేస్తున్నాయి. మనమూ వీలైనంత త్వరగా బూస్టర్ డోసు ప్రారంభించాలి. ముందుగా కనీసం ముప్పు తీవ్రత అధికంగా ఉన్నవారికి ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
కొవిడ్ చికిత్సలో ఆధునిక ఔషధాలు వచ్చాయా?
ఇన్‌ఫెక్షన్ సోకిన మొదటి వారంలో రోగి చికిత్స పొందితే ఎంత తీవ్రంగా ఉన్నా ఎక్కువ సందర్భాల్లో నయమవుతోంది. 15 రోజుల తర్వాత ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు చికిత్స కష్టమవుతోంది. ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్’ చికిత్సతో మెరుగైన ఫలితాలొస్తున్నాయి. జీవితాన్ని కాపాడవచ్చు. ఇప్పటి వరకూ మా ఆసుపత్రిలోనే 2,500 మందికి ఈ చికిత్స అందించాం. ఇన్‌ఫెక్షన్ సోకిన 15 రోజులు దాటిన తర్వాత పరిస్థితి విషమించిన వారికి ఈ చికిత్స ఉపయోగపడదు. వచ్చే జనవరి, ఫిబ్రవరిల్లోగా ‘మోల్నుపిరవిర్’ వంటి కొత్త ఔషధాలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా కొవిడ్ చికిత్సలో మెరుగైన ఫలితాలు వస్తాయి.
బూస్టర్‌గా ఏ టీకా మేలు?
రెండు డోసులు ఏది స్వీకరించారో.. అదే తీసుకోవచ్చు. లేదా వేరేది కూడా తీసుకోవచ్చు. మేం దీనిపై అధ్యయనం చేశాం. కొవాగ్జిన్ రెండు డోసులు పూర్తయినవారికి బూస్టర్‌గా కొవిషీల్డ్, కొవిషీల్డ్ రెండుడోసులు తీసుకున్నవారికి కొవాగ్జిన్‌ను బూస్టర్‌గా అందించాం. ఏది తీసుకున్నా యాంటీబాడీస్ చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. ఒకే రకమైన టీకాను మూడోడోసుగా తీసుకోవడం కంటే.. వేరే రకాన్ని బూస్టర్‌గా తీసుకుంటే ఇంకా మెరుగ్గా యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయని గుర్తించాం.
ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలి?
రెండోడోసు తీసుకున్న 6-9 నెలల మధ్యలో వేసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దీనిపై కూడా ఒక ఆసక్తికరమైన అధ్యయనం జరిగింది. టీకా తీసుకున్న ప్రతి 108 రోజులకు యాంటీబాడీల స్థాయి సగానికి తగ్గిపోతోంది. 208 రోజులకు నాలుగో వంతుకు పడిపోతోంది. అందుకే రెండు డోసులు తీసుకున్న 6 నెలల తర్వాత ఎప్పుడైనా మరో డోసు వేసుకోవాలి.
బూస్టర్ డోసుపై శాస్త్రీయ అధ్యయనాలున్నాయా?
బూస్టర్ డోసు తీసుకోవడం చాలా అవసరం. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి.
* అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC)’ కూడా బూస్టర్ డోసు అవసరమని తేల్చిచెప్పింది.
* యూకే, ఫ్రాన్స్ ప్రభుత్వాలు కూడా బూస్టర్ డోసు తీసుకోవాలంటున్నాయి. చైనాలో ఇప్పటికే అది ఇస్తున్నారు.
* ఇజ్రాయెల్‌లోనూ బూస్టర్ డోసును వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఇక్కడ చేసిన అధ్యయనాన్ని ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు. దీని ప్రకారం.. బూస్టర్ డోసు తీసుకోని వారు తీవ్ర ఇన్‌ఫెక్షన్ బారినపడి ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చింది. మూడోడోసు తీసుకున్న 6 నెలల తర్వాత కొవిడ్ ఇన్‌ఫెక్షన్ నుంచి పూర్తిస్థాయి రక్షణ లభిస్తుందని ఇజ్రాయెల్ అధ్యయనం వెల్లడించింది. బూస్టర్ డోసు లేని వారు మళ్లీ ఇన్‌ఫెక్షన్ బారినపడుతున్నట్లుగా కూడా గుర్తించారు.
* ఖతార్‌లో చేసిన అధ్యయనంలోనూ బూస్టర్ డోసు తీసుకోకుంటే ఇన్‌ఫెక్షన్ బారినపడుతున్నట్లు స్పష్టమైంది.
* ప్రఖ్యాత వైద్య పత్రికలు ‘నేచర్’, ‘లాన్సెట్’లోనూ దీనిపై అధ్యయన పత్రాలను ప్రచురించారు.
* భారత్‌లోనూ ఐసీఎంఆర్ భువనేశ్వర్‌లో 600 మందిపై చేసిన ఒక అధ్యయనం వచ్చింది. రెండు డోసుల టీకా తీసుకున్న 6 నెలల తర్వాత యాంటీబాడీస్ తగ్గిపోతున్నట్లుగా ఈ అధ్యయనం పేర్కొంది.
* ఏఐజీలోనూ ఈ కోణంలో అధ్యయనం చేస్తున్నాం. దీని ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. 500 మంది రెండు డోసులు తీసుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్ బారినపడిన వారిని.. 600 మంది ఒక్క డోసు కూడా టీకా తీసుకోకుండా ఇన్‌ఫెక్షన్ సోకిన వారిని అధ్యయనం చేశాం. ఇందులో రెండు డోసులు తీసుకున్న వారిలో ఇన్‌ఫెక్షన్ తీవ్రరూపం దాల్చలేదు. అదే టీకాలు తీసుకోని వారు ఐసీయూలో చికిత్స పొందాల్సి వచ్చిందని గుర్తించాం. ఈ 500 మంది రెండు డోసులు పొందినవారిలోనూ 2 శాతం మంది తీవ్ర అనారోగ్యం బారినపడ్డారు. ఎందుకని లోతుగా విశ్లేషిస్తే.. వీరిలో యాంటీబాడీస్ (Antibodies) స్థాయి చాలా స్వల్పంగా ఉంది. దీన్నిబట్టి బూస్టర్ డోసు అవసరమనేది స్పష్టమవుతోంది.
ఇవీ చదవండి: