తొలిసారిగా రాష్ట్రంలో ఒక్క రోజులో 40 వేల పరీక్షలకు పైగా నిర్వహించడం విశేషం. ఈనెల 22 రాత్రి 8 గంటల వరకూ మొత్తంగా కొవిడ్ పాజిటివ్‌ల సంఖ్య 1,04,249కి పెరగగా, పరీక్షల సంఖ్య కూడా 9,31,839కి చేరుకుంది. మరో 1,347 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ ఆదివారం కరోనా సమాచారాన్ని విడుదల చేసింది.
పరీక్షలు పెంచడంతో...
రాష్ట్రంలో ఒకపక్క నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచుతుంటే.. మరోవైపు కరోనా కేసుల నమోదు శాతం తగ్గుతోంది. గత వారం రోజుల కేసుల సరళిని పరిశీలిస్తే ఇదే అవగతమవుతోంది. ఈనెల 16(ఆదివారం)న పాజిటివ్‌ల శాతం 10.16 ఉండగా.. క్రమేణా తగ్గుతూ 22(శనివారం) నాటికి 5.86 శాతానికి చేరింది. పరీక్షల సంఖ్య పెంచడంతో పాజిటివ్‌ల సంఖ్య తగ్గుతున్నట్లుగా వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్) పరిధిలో కేసుల శాతం తగ్గుతున్నట్లుగా భావిస్తున్నాయి. ప్రస్తుతం రోజుకు 40వేలకు పైగా పరీక్షలు చేస్తుండగా.. వీటిలో 30 శాతం (దాదాపు 10 వేలకు పైగా) పరీక్షలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నిర్వహిస్తున్నారు. అయినా కేసుల నమోదులో పెద్దగా మార్పు కనిపించడం లేదనీ, గతంతో పోల్చితే ఇటీవల కాలంలో జీహెచ్‌ఎంసీలో కరోనా ఉద్ధృతి తగ్గిందని వైద్యవర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. పరీక్షల్లో దాదాపు 70 శాతం వరకూ జిల్లాల్లోనే చేస్తున్నారు. గత వారం రోజుల్లో జిల్లాల్లో పరీక్షల సంఖ్య క్రమేణా పెంచుతుండడంతో.. ఆ మేరకు ఫలితాలు కూడా కనిపిస్తున్నట్లుగా వైద్యవర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్‌లో 100 మందికి పాజిటివ్ వస్తే.. వారిద్వారా 85 మందికి వైరస్ వ్యాప్తి చెందుతోంది. అదే గ్రామీణంలో 100 మందికి పాజిటివ్ వస్తే.. వారిద్వారా 130 మందికి వైరస్ సోకుతోందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీన్నిబట్టి రాజధానిలో వైరస్ వ్యాప్తి తగ్గినట్లు అవగతమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1076 యాంటిజెన్ కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వ వైద్యంలో 16 ల్యాబ్‌ల్లో, ప్రైవేటులో 31 ల్యాబ్‌ల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలను చేస్తున్నారు.
కోలుకున్న వారు 80 వేలకు పైనే
రాష్ట్రంలో శనివారం మరో 1851 మంది కోలుకోగా, మొత్తంగా ఇప్పటి వరకూ కొవిడ్ నుంచి ఆరోగ్యవంతులుగా బయటపడినవారి సంఖ్య 80,586కు చేరుకుంది. మొత్తం పాజిటివ్‌ల్లో కోలుకున్నవారు 77.30 శాతం కాగా, ఈ విషయంలో జాతీయ సగటు 74.69 శాతంగా నమోదైంది. కరోనాతో మరో 11 మంది మృతిచెందడంతో.. మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 755కు పెరిగింది. ప్రస్తుతం కరోనా బారినపడి 22,908 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో ఆసుపత్రుల్లోని ఐసొలేషన్ కేంద్రాల్లో, ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నవారు 16,379 మంది ఉన్నారు. శనివారం నాటికి ప్రభుత్వ వైద్యంలో కొవిడ్ సేవలకు 42 ఆసుపత్రుల్లో మొత్తంగా 7952 పడకలను కేటాయించగా, వీటిలో 2410 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారు. 5542 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు వైద్యంలో కరోనా చికిత్సల కోసం 170 ఆసుపత్రుల్లో 9057 పడకలను కేటాయించగా, శనివారం నాటికి 4119 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారు.4938 పడకలు ఖాళీగా ఉన్నాయి.
మున్ముందు రోజుకు 50 వేలు
![](https://assets.eenadu.net/article_img/23Main-5a.jpg)
నగరాలతో పోల్చితే గ్రామాల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం సులువు. అలాంటిది ఇప్పుడు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. పరీక్షల సంఖ్య పెంచడం వల్ల పాజిటివ్‌లుగా నిర్ధారించిన వారిని గ్రామీణంలో త్వరగా ఐసొలేషన్ చేయగలుగుతాం. అవసరమైన చికిత్సను వెంటనే ఇవ్వడానికి వీలుంటుంది. ప్రస్తుతం జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. మున్ముందు రాష్ట్రంలో రోజుకు 50 వేల పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. తద్వారా వ్యాప్తి మరింతగా తగ్గే అవకాశం ఉంది. ప్రజలు కొవిడ్ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో సీజనల్ వ్యాధుల వల్ల కూడా దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు ఇవి సాధారణమే అనుకొని నిర్లక్ష్యం చేయొద్దు. కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి.
-డాక్టర్ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
![](https://assets.eenadu.net/article_img/23Main-5b.jpg)