రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమానికి అందరం పునరంకితం అవుదామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం సిద్దించినట్లు అని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సభాపతి పాల్గొన్నారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

135కోట్ల భారత పౌరులకు, రాష్ట్రంలోని సోదరసోదరీమణులకు పేరు పేరున 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా జరుపుకునే పండుగ ఇది. మహాత్మ గాంధీ అహింస మార్గాన తీసుకొచ్చిన స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం. పోటీపడి రాష్ట్రాలను అభివృద్ధి చేసుకునేలా పని చేయాలే తప్ప అడ్డంకులు సృష్టించవద్దు. ఏడేళ్లలో తెలంగాణ భారతదేశానికే ఆదర్శంగా నిలిచింది. శాంతి భద్రతల కోసం పోలీసు వ్యవస్థ నిరంతరం పనిచేస్తోంది. ప్రభుత్వం యంత్రాగం, పోలీసులకు అభినందనలు.
-పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభాపతి
జెండా ఆవిష్కరిస్తున్న స్పీకర్
మండలిలో వేడుకలు
శాసనమండలిలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. మహాత్మాగాంధీ విగ్రహానికి మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఛైర్మన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన అన్నారు.

సేవలు మరువం
అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పూలమాలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

జీహెచ్‌ఎంసీలో
జీహెచ్‌ఎంసీ(GHMC) కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. అధికారులు, కార్పొరేటర్లతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు.

కలెక్టరేట్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలు
నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఎల్.శర్మన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఉద్యోగులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

సీపీ కార్యాలయంలో జెండా వందనం
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీపీ కార్యాలయ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి సుధారాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్ని జాతీయ గీతాన్ని ఆలపించారు.

డీజీపీ కార్యాలయంలో..
లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పోలీసు కవాతును స్వీకరించిన అనంతరం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు స్వాతి లక్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యాలయ అధికారులు, సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు.

హెచ్చార్సీలో వేడుకలు
నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో 75వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు కవాతును స్వీకరించిన హెచ్చార్సీ ఛైర్మన్, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సభ్యులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

టీఎస్‌పీఎస్‌సీలో జెండా పండగ
నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో జెండా పండగ ఘనంగా జరిగింది. పోలీసు కవాతును స్వీకరించిన టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి... కార్యదర్శి వాణి ప్రసాద్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సభ్యులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఇదీ చదవండి: ఐదు వారాల్లో.. అడ్డంగా గీసేసి అడ్డదిడ్డ దేశ విభజన!