ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సెకండ్ వేవ్‌లో మొదటిసారిగా శుక్రవారం 6వేల కేసులు నమోదయ్యాయి. అదే ఉద్ధృతి కొనసాగిస్తూ 24 గంటల వ్యవధిలోనే 7వేలకుపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,907 పరీక్షలు నిర్వహించారు. 7,224 కేసులు నిర్ధారణ కాగా.. 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,55,455 మంది వైరస్ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున; గుంటూరు, కడప, కృష్ణా, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మహమ్మారికి బలయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,388కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,332 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,07,598కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,469 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,56,42,070 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,051, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో వరుసగా రెండో రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం.
ఇదీ చదవండి: లింగోజిగూడ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని తెరాస నిర్ణయం