వైద్యం అత్యంత ఖరీదైపోయింది. ముఖ్యంగా రోగ నిర్ధారణ పరీక్షల వ్యయం తలకు మించిన భారమైంది. రక్త పరీక్షలు చేయించుకుంటే... కనీసం వెయ్యి వదిలించుకోవాల్సిందే. ఛాతీ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ, ఎంఆర్‌ఐ వంటి స్కానింగ్ చేయించుకోవాలంటే.. వేలకు వేలు జేబుకు చిల్లు పడటం ఖాయం. సామాన్యులకు ఈ భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
57 రకాల పరీక్షలు
57 రకాల సాధారణ రక్త, మల, మూత్ర సమగ్ర పరీక్షలను, ఆధునిక పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది. మూడేళ్ల కిందట జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభించిన టి-డయాగ్నోస్టిక్స్‌ను పల్లెలకూ విస్తరించాలని నిర్ణయించింది. సిద్దిపేటలో ఇటీవలే ప్రారంభించగా.. నెలలో మరో 19 జిల్లాల్లో ప్రారంభించేందుకు వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. నాణ్యతా, ప్రమాణాల విషయంలోనూ రాజీ పడకుండా.. తమిళనాడుకు చెందిన సీఎంసీ వెల్లూర్, ఎయిమ్స్ దిల్లీ ఆసుపత్రులతో ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు ఆసుపత్రుల నిపుణులు ఎప్పటికప్పుడు ఇక్కడి ప్రయోగశాలల్లో నిర్ధారణ పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించి, అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తుంటారు.
రాష్ట్రమంతటా..
2018 జనవరిలో తొలిసారిగా నారాయణగూడలోని ఐపీఎంలో ‘తెలంగాణ డయాగ్నోస్టిక్స్' పేరిట నూతన పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దీని పరిధిలోకి 2 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రులు, 9 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 104 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 200 బస్తీ దవాఖానాలను అనుసంధానం చేశారు. ఇప్పుడు ఈ సేవలను 'టి-డయాగ్నొస్టిక్స్' అనే బ్రాండ్ పేరిట రాష్ట్రమంతటా విస్తరించాలని... ఈసీజీ, ఎక్స్‌రే, ఇతర ఫలితాలను టెలీ రేడియాలజీ విధానానికి అనుసంధానం చేయాలని నిర్ణయించింది.
ఫోన్ నంబరుకు ఫలితాలు
అన్ని జిల్లాల్లోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు ఈ ప్రయోగశాలలకు అనుసంధానమవుతాయి. నిత్యం వీటిలో సేకరించిన నమూనాలను జిల్లా కేంద్రంలోని ప్రయోగశాలకు చేర్చుతారు. నమూనాలు సేకరించేటప్పుడే ఆన్‌లైన్‌లో పొందుపరచిన సమాచారం ప్రయోగశాలకు చేరుతుంది. పరీక్షల నమూనాలను పరికరాల్లో పొందుపరచినప్పుడే.. రోగి సమాచారం కూడా పరికరానికి చేరిపోతుంది. దీంతో పరికరమే ఆన్‌లైన్‌లో నేరుగా రోగి ఫోన్ నంబరుకు ఫలితాల సమాచారాన్ని పంపిస్తుంది. అదే సమాచారం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, ఇతర ఆసుపత్రులకు పంపిస్తుంది. అవసరమైతే రోగులు ఆ కేంద్రానికి వెళ్లి కూడా సమాచారం పొందవచ్చు.
అనుబంధ పరీక్షలు
జిల్లాల్లో నెలకొల్పనున్న ప్రయోగశాలలన్నీ అత్యాధునికమైనవే. పూర్తిస్థాయిలో వాటంతటవే పరీక్షలు నిర్వహించి, ఫలితాలను వెల్లడించే 3 రకాల పుల్లీ ఆటోమెటేడ్ మిషన్స్‌ను నెలకొల్పారు. ప్రతి ప్రయోగశాలలోనూ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ వైద్య నిపుణులను నియమిస్తారు. ప్రయోగశాలల్లో 57 రకాల సాధారణ రక్త, మల, మూత్ర సమగ్ర పరీక్షలు చేస్తారు. వీటికి అనుబంధంగా ఉండే సుమారు 150 రకాల పరీక్షలు ఇందులో ఉంటాయి. టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాల నిర్ధారణ, కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్ పనితీరు పరీక్షలు రక్తంలో కొలెస్ట్రాల్, మూణ్నెళ్ల సగటు చక్కెరస్థాయి, కీళ్లవాతం తదితర పరీక్షలు నిర్వహిస్తారు.
మిగిలిన జిల్లాల్లోనూ
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, జనగామ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, నాగర్‌కర్నూల్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, సంగారెడ్డి, వికారాబాద్ ఆసుపత్రుల్లో వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. కరీంనగర్, ఖమ్మం, జోగులాంబ గద్వాల, ములుగు జిల్లాల్లో ఇప్పటికే నెల రోజులుగా ప్రయోగాత్మక సేవలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన జిల్లాల్లోనూ వీటిని నెలకొల్పుతామని వైద్యవర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి : ప్రభుత్వం ఆరేళ్లుగా నిరుద్యోగులను మోసం చేస్తోంది: కోదండరాం