గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో.... స్థానికంగా వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. బస్తీ దవాఖానాలకు మంచి ఆదరణ లభిస్తుండటం వల్ల వాటిని సంఖ్యను మరింతగా పెంచనుంది. నేటి నుంచి మరో 45 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తోంది. హైదరాబాద్‌లో 22, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 5, సంగారెడ్డి జిల్లాలో.. 3 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో.... 123బస్తీ దవాఖానాలు ప్రతి రోజు 10వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. కొత్తగా ప్రారంభించే 45బస్తీ దవాఖానాలతో.... అదనంగా 4వేల మందికి వైద్య సేవలు అందనున్నాయి. ఒక్కో బస్తీ దవాఖానాలో.. ఒక వైద్యుడు ఒక నర్స్, ఒక సహాయకుడు ఉండనున్నారు.
ప్రైవేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వ వైద్యం అందించాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానాలను తీర్చిదిద్దుతున్నామని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. కవాడిగూడ డిజన్‌లోని ఏవీ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మేయర్ పరిశీవిలించారు. నగరంలో 500 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 150 రకాల మందులు, 57 రకాలైన రక్త నమూన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. నిరుపేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరూ సహకారం అందించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ విన్నవించారు.
బస్తీ దవాఖానాల్లో అవుట్ పేషెంట్ సేవలు అందించడంతోపాటు.. కనీస వైద్య పరీక్షలైన బీపీ, షుగర్ రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక