ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం ఆయన అనుచరులు 40 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ తనకు ఆఫర్ వచ్చిందని సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి నాగమారుతీశర్మ తెలిపారు. బెయిల్ కుంభకోణానికి సంబంధించి ఓ కేసులో సాక్షిగా ఉన్న నాగమారుతీ శర్మ ఇవాళ ఏసీబీ కోర్టుకు హాజరై వాంగ్మూలమిచ్చారు. జిల్లా జడ్జి హోదాలో 2011 ఏప్రిల్ 19 నుంచి 2012 ఏప్రిల్ 23 వరకు సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా పనిచేసినట్లు ఆయన వివరించారు. హైకోర్టులో గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన లక్ష్మీనర్సింహరావు ఓ రోజు తనకు ఫోన్ చేసి కలవాలనుకుంటున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. తనకన్నా సీనియర్ కావడంతో తానే ఆయన ఇంటికి వెళ్లానన్నారు. ఆ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇస్తే ఆయన అనుచరులు 40 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పినట్లు వివరించారు. కానీ ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు వెల్లడించారు. శర్మను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు లక్ష్మీనరసింహరావు తరఫు న్యాయవాదులు కోరడంతో.. విచారణను సెప్టెంబరు 12వ తేదీకి వాయిదా వేశారు. కాగా గాలి జనార్దన్ రెడ్డి, ఇతర నిందితులు ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు.
ఇదీ చూడండి :ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం