Theatres Seized In AP: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శుక్రవారం సినిమా థియేటర్లలో తనిఖీలు కొనసాగాయి. నిబంధనలు అమలు చేయడం లేదన్న కారణాలతో పలుచోట్ల థియేటర్లు సీజ్ చేశారు. లోపాలపై థియోటర్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కొన్నిచోట్ల బోర్డులు పెడుతున్నారు.
సినిమా థియోటర్ల తనిఖీలు పరంపర శనివారం కూడా కొనసాగుతుంది. విజయవాడ నగరంలోని అన్నపూర్ణ, శకుంతల, అప్సర థియేటర్లను జాయింట్ కలెక్టర్ మాధవీలత.. ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ వద్ద ధరల పట్టికను పరిశీలించారు. నిబంధనలు పాటించడంలేదని.. కృష్ణా జిల్లాలో 12 థియేటర్లను అధికారులు మూయించారు. టిక్కెట్ల ధరలు తగ్గించడంతో జిల్లాలో 18 సినిమా హాళ్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. మొత్తం మీద జిల్లాలో 30 థియేటర్లు మూతపడ్డాయి.
బెనిఫిట్ షో వేశారని..
గుంటూరు జిల్లాలో 70 థియేటర్లను అధికారులు తనిఖీ చేశారు. 35 సినిమా హాళ్లకు నోటీసులు జారీ చేశారు. 15 సినిమాహాళ్ల మూసివేతకు ఆదేశాలు జారీచేశారు. గుంటూరులోని శ్రీలక్ష్మి సినిమా హాల్‌ను సీజ్ చేశారు. అనుమతి లేకుండా శ్యాం సింగరాయ్ సినిమా బెనిఫిట్ షో వేసిన 4 థియేటర్లకు పది వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. బిఫామ్ రెన్యువల్ చేయని మరో 25 వాటికి జరిమానా విధించారు. చిలకలూరిపేటలో లైసెన్స్ రెన్యువల్ చేసుకొని కారణంగా రామకృష్ణ, శ్రీనివాస, విజయలక్ష్మి, వెంకటేశ్వర, కృష్ణ మహల్ థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు పాటించని మరో 5 ఏసీ థియేటర్లకు.. ఒక్కొక్క దానికి 10 వేల చొప్పున జరిమానా విధించారు.
విశాఖలో థియేటర్లను జిల్లా కలెక్టర్ తనిఖీచేశారు. జగదాంబ థియేటర్‌లో.. త్రీడీ అద్దాల కోసం అదనంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వివరణ కోరుతూ నోటీసు జారీచేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, భీమవరం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, తణుకులోని థియెటర్లలో రెవెన్యూ, అగ్నిమాపకశాఖ అధికారులు సోదాలు చేశారు. తణుకులో 3 సినిమా హాళ్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఒంగోలు సత్యం ధియోటర్‌ను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తనిఖీ చేశారు. నిబంధనలు పాటించడం లేదంటూ.. ఫారం బి నోటిసులు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 29 థియేటర్లకు నోటీసులు ఇచ్చామని.. వారం రోజుల్లో రెన్యూవల్ చేసుకోకుంటే సీజ్ చేస్తామని కలెక్టర్ తెలిపారు. కర్నూలులోని ఆనంద్ సినీ కాంప్లెక్స్ థియేటర్స్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇదీ చూడండి: సినిమా చూపించలేం మావా..! ఆందోళనలో ఏపీ ఎగ్జిబిటర్లు.. అసలేం జరుగుతోంది..?