ఈ ఏడాది వ్యవసాయానికి రోజూ 5 వేల మెగావాట్లకు పైగా వాడుతున్నందున వినియోగం ఏ సమయంలోనూ తగ్గడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్‌లో రోజూ 50 ఎంయూలకు పైగా తాత్కాలికంగా కొనాల్సి వస్తోంది. రెండు నెలలుగా కొనుగోలు వ్యయం భారీగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు తాజాగా రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. బడ్జెట్ కేటాయింపులకు ఇది అదనం.
వ్యవసాయంతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో పరిశ్రమలు, గృహావసర వినియోగం ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర వినియోగం బాగా పెరిగిందని ట్రాన్స్‌కో- జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ‘ఈనాడు’కు తెలిపారు. నిరంతరాయంగా వినియోగం పెరగడం రాష్ట్రం ఏర్పడిన తరవాత ఇదే తొలిసారి అని వివరించారు.
- సాధారణంగా ప్రతిరోజు ఉదయం పూట వ్యవసాయ బోర్లు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు ప్రారంభమయ్యే సమయంలో డిమాండ్ గరిష్ఠ స్థాయికి చేరుతుంది. రాత్రివేళ వాటి వినియోగం లేక డిమాండ్ పడిపోతుంది.
- కానీ, ఈ ఏడాది భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. గత నెల ఆరంభం నుంచి డిమాండ్‌తో పాటు వినియోగమూ గరిష్ఠ స్థాయిలో నమోదవుతోంది.
- రోజులో ఏదో ఒక సమయంలో 5 లేదా 10 నిమిషాలు అత్యంత ఎక్కువగా వాడకాన్ని గరిష్ఠ విద్యుత్ డిమాండ్ అంటారు.
- వినియోగం అంటే రోజంతా రాష్ట్రం మొత్తమ్మీద అన్ని రకాల కనెక్షన్లకు కలిపి ఎంత వాడారనే లెక్క.
- మార్చి 29న ఉదయం పూట 12,926 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. ఇది గతేడాది మార్చి 3న నమోదైన గరిష్ఠ డిమాండ్ (12,941 మెగావాట్లు)కు దగ్గరగా ఉంది.
- వినియోగం పరంగా చూస్తే మార్చి 29న 267 ఎంయూలు నమోదైంది. ఇది గతేడాది కన్నా 14 ఎంయూలు అదనం కావడం గమనార్హం.
ఇవీ చూడండి: కలవరపెడుతున్న కరోనా.. వేగంగా విస్తరిస్తున్న డబుల్ మ్యూటెంట్