2018 Group-1 Results Out: ఆంధ్రప్రదేశ్‌లో 2018 గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ విజయవాడలో వెల్లడించారు. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. 2018లో 167 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నియమాక ప్రక్రియ చేపట్టింది. గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 67 మంది మహిళలు, 96 మంది పురుషులు ఉన్నారని గౌతమ్ సవాంగ్ తెలిపారు. వివిధ కారణాలతో నాలుగు పోస్టులు భర్తీ చేయలేదని చెప్పారు. డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత టాప్ 1లో నిలిచారని వెల్లడించారు. టాప్ 2లో వైఎస్సార్‌జిల్లా కోతులగుట్టపల్లికి చెందిన కె.శ్రీనివాసరాజు, టాప్ 3లో హైదరాబాద్‌కు చెందిన సంజన సింహ ఉన్నారు.
త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్: గౌతమ్ సవాంగ్
ఈ సందర్భంగా సవాంగ్ మాట్లాడుతూ.. ‘‘2018 గ్రూప్-1 అభ్యర్థులు నాలుగేళ్లుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబరు 2020లో జరిగిన మెయిన్స్ పరీక్షలో 9,679 మంది పాల్గొన్నారు. డిజిటల్ విధానంలో వ్యాల్యూయేషన్ చేసి గతేడాది ఏప్రిల్‌లో ఫలితాలు విడుదల చేశాం. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది మాన్యువల్‌గా వ్యాల్యూయేషన్ చేసి మేలో ఫలితాలు విడుదల చేశాం. హైకోర్టు ఆదేశాల మేరకు 165 గ్రూప్-1 పోస్టుల ఖాళీల భర్తీ కోసం ఇంటర్వ్యూలు పారదర్శకంగా పూర్తి చేశాం. 3 బోర్డులు నియమించి పారదర్శకంగా గ్రూప్-1 ఇంటర్వ్యూలు నిర్వహించాం. నాలుగేళ్లపాటు జరిగిన నియమాక ప్రకియను విజయవంతంగా పూర్తి చేశాం. హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను ఏపీపీఎస్సీ కచ్చితంగా అమలు చేసింది. వచ్చే నెలలో 110 పోస్టులతో గ్రూప్-1, 182 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. ఈనెల 24న దేవాదాయశాఖలో ఈవో పోస్టులకు, 31, రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష ఉంటుంది. డిజిటల్ వ్యాల్యూయేషన్‌పై న్యాయస్థానంలోనూ విచారణ జరిగింది. టెక్నాలజీ వినియోగంతో రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి’’ అని వెల్లడించారు.
ఇదీ చదవండి: