లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన మెట్రోరైలు సేవలు దాదాపు 6 నెలల తర్వాత ప్రారంభమయ్యాయి. అన్లాక్ 4లో భాగంగా మెట్రో రైలు సేవలు పునరుద్ధరించడంపై నగర వాసుల నుంచి మంచి ఆదరణ లభించిందని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. దశల వారీగా అన్ని కారిడార్లలో మెట్రో సేవలు పునరుద్ధరిస్తున్నామని ఎండీ పునరుద్ఘాటించారు. అందులో భాగంగానే సోమవారం మియాపూర్-ఎల్బీనగర్ రూట్లో 120 ట్రిప్పులను నడిపినట్లు పేర్కొన్నారు. మొత్తం 19 వేల మంది మెట్రోలో ప్రయాణించినట్లు స్పష్టం చేశారు.
వాటితో మాత్రమే ప్రయాణం..
ఉదయం 7 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 9 వరకు మెట్రో అందుబాటులో ఉంటుందని వివరించారు. కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్న గాంధీ ఆస్పత్రి, భరత్ నగర్, మూసాపేట్, యూసఫ్ గూడా స్టేషన్లను మూసివేసినట్లు తెలిపారు. మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు ప్రకటించారు. స్మార్ట్‌కార్డ్, క్యూఆర్ కోడ్ టికెట్లతో మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తున్నారు.
ప్రయాణికుల సంతృప్తి..
మెట్రో స్టేషన్లలో, రైళ్లల్లోనూ శానిటైజేషన్ ఏర్పాట్లపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం నుంచి నాగోల్-రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలు అందుబాటులో ఉంచుతామన్నారు.
బుధవారం జేబీఎస్-ఎంజీబీఎస్ రూట్
9వ తేదీ నుంచి జేబీఎస్- ఎంజీబీఎస్ రూట్లలో మెట్రో సేవలు నడవనున్నట్లు తెలిపారు. ఫలితంగా నగరంలోని మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రతి ఐదు నిమిషాలకో రైలు..
ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడిచేలా ఏర్పాట్లు చేశారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధించాలని మెట్రో సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.