రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం భారీగా 1,879 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. వాటితో కలుపుకుంటే తెలంగాణలో బాధితుల సంఖ్య 27,612కి చేరినట్లు వివరించింది. మంగళవారం నమోదైన కేసుల్లో అధికంగా 1,422 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వెలుగుచూశాయి.
రంగారెడ్డిలో 176, మేడ్చల్ 94, కరీంనగర్ 32, నల్గొండ జిల్లాలో 31 మందిలో వైరస్ గుర్తించినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. నిజామాబాద్ 19, వరంగల్ పట్టణ జిల్లా 13, మెదక్, ములుగు జిల్లాల్లో 12 చొప్పున కేసులు నమోదైనట్లు వివరించింది. మహబూబ్‌నగర్ 11, సూర్యాపేట 9, కామారెడ్డి 7, భూపాలపల్లి 6, గద్వాల జిల్లాలో 4 కరోనా కేసులు వెలుగుచూసినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. పెద్దపల్లి, ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మూడేసి... జగిత్యాల, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో రెండేసి చొప్పున కేసులు వచ్చినట్లు తెలిపింది. వికారాబాద్, ఆదిలాబాద్, జనగాం, వనపర్తి, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
మృతుల సంఖ్య 313..
మంగళవారం 1,506 మంది కోలుకోగా... మొత్తం 16,287 మంది డిశార్చయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 11,012 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ వివరించింది. వైరస్ బారినపడి మరో ఏడుగురు చనిపోగా... మృతుల సంఖ్య 313కి చేరినట్లు పేర్కొంది.
పడకలున్నాయి..
రాష్ట్రంలో కరోనా చికిత్సకు పడకలు అందుబాటులో లేవన్న వార్తలపై స్పందించిన వైద్యారోగ్య శాఖ అందుబాటులో ఉన్న పడకల వివరాలను వెలువరించింది. తెలంగాణలో 17,081 పడకలకుగానూ... మరో 15,746 ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో మొత్తం 1,1928 ఐసోలేషన్ పడకలు ఉండగా... 660 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. మరో 11, 268 ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. 3,537 ఆక్సిజన్ సరఫరా ఉన్న పడకలకుగానూ... 3,041 ఖాళీగా ఉన్నట్లు వివరించింది. 1,616 ఐసీయూ పడకలకు... 1,437 పడకలు ఖాళీగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో పడకలు అందుబాటులో లేవంటూ వస్తున్న వార్తలపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ సూచించింది.
ఇవీ చూడండి: మహమ్మారిపై 'ధారావి' పోరు- కొత్తగా ఒకే ఒక్క కేసు