SSC Exams in Telangana : తెలంగాణలో ఎస్‌ఎస్‌సీ పరీక్షలు రాసేందుకు సరిపడా వయసు లేకున్నా ప్రత్యేక అనుమతి పొందుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా వయసులో చిన్నోళ్లు అయిన 18,491 మంది రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అయితే వారంతా మెడికల్ సర్టిఫికెట్, ప్రధానోపాధ్యాయుల సిఫారసు లేఖలతో ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారుల (డీఈవోలు) నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. దాని కోసం ఒక్కొక్క విద్యార్థి రూ.300 ఫీజు కూడా చెల్లించారు.
అధిక శాతం ప్రైవేటు పాఠశాలలకు చెందినవారే : 2017లో ఇలాంటి వారు 14 వేల మంది ఉండగా.. క్రమేపీ వారి సంఖ్య పెరుగుతోందని పదో తరగతి బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు దాదాపు 4.86 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతుండగా.. వారిలో 3.8 శాతం మంది వయసులో చిన్నోళ్లు ఉన్నారు. వీరిలో 90 శాతానికి పైగా ప్రైవేటు బడులకు చెందిన వారేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులు పదో తరగతిని దృష్టిలో పెట్టుకొని ప్రవేశాల సమయంలోనే రిజిస్టర్‌లో వయసును రాస్తారని, ప్రైవేటులో అయితే అవగాహన లేకపోవడంతో పిల్లలను చేర్చుకుంటున్నారని.. అందుకే ప్రైవేటు బడుల్లో తక్కువ వయసున్నవారు ఉంటున్నారని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ప్లే స్కూళ్ల ద్వారా మూడేళ్ల వయసున్న పిల్లలను చేరుస్తున్నారు. దానివల్ల తక్కువ వయసులోనే పదో తరగతిలోకి విద్యార్థులు ప్రవేశిస్తున్నారు’ అని విద్యాశాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
ఆగస్టు నాటికి వారికి 14 ఏళ్లు నిండాలి : రాష్ట్ర విద్యాశాఖ నిబంధనల ప్రకారం విద్యార్థులు పదో తరగతిలో చేరిన విద్యా సంవత్సరంలో ఆగస్టు 31వ తేదీ నాటికి 14 ఏళ్లు నిండితేనే ఎవరైనా వార్షిక పరీక్షలు రాసేందుకు అర్హులు. ఉదాహరణగా చూస్తే.. 2022-23లో అయితే 2022 ఆగస్టు 31 నాటికి 14 సంవత్సరాలు నిండాలి. అప్పటికి ఒకరోజు వయసు తగ్గినా డీఈవోల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిందే. ఈ విధంగా 14 సంవత్సరాలకు ఏడాదిన్నర వరకు వయసు తగ్గితే డీఈవోలు అనుమతి ఇస్తారు. అంతకు మించితే ప్రభుత్వ పరీక్షల విభాగం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఈ విభాగం నుంచి అనుమతి కోరుతూ ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, అంటే అలాంటి వారంతా ఉండాల్సిన దాని కంటే ఏడాదిన్నరలోపు వయసు తక్కువగా ఉన్నవారేనని అధికారులు పేర్కొంటున్నారు. అధిక శాతం మంది ఇలాంటి వారిలో 13-14 సంవత్సరాల మధ్య వయసు వారేనని స్పష్టం చేశారు.
వీళ్లకు మెడికల్ సీటొస్తే సమస్యే : ఇంటర్ పూర్తి చేసే వరకు వయసు తక్కువగా ఉన్నా పెద్ద సమస్యేమీ కాదు. కానీ బైపీసీ చదివి మెడికల్ సీటు వస్తే కచ్చితంగా.. ఆ కళాశాలలో ప్రవేశం పొందే సంవత్సరం డిసెంబరు 31 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. లేకపోయినట్లయితే తిరస్కరిస్తారని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా ఎంసెట్ ద్వారా బీఎస్‌సీ అగ్రికల్చర్‌లో చేరేందుకూ అదే నిబంధన వర్తిస్తుంది. అలాగే బీటెక్, బీఫార్మసీ చదివే వారికి మాత్రం 16 సంవత్సరాలు నిండితే చాలు.
ఇవీ చదవండి: