‘‘నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పాటు వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. విధుల్లో 9,737 మంది ఉపాధ్యాయులు, 185 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. అందులో 487 మంది టీచర్లు, అయిదుగురు అధ్యాపకులు కరోనా బారిన పడ్డారు. చనిపోయిన 17 మంది ఉపాధ్యాయుల్లో ఏడుగురు ఎస్‌జీటీలు, ఎనిమిది మంది స్కూల్ అసిస్టెంట్లు, ఒకరు పీఈటీ, మరొకరు టీఆర్‌టీ. వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన వారు అయిదుగురు, నల్గొండలో నలుగురు, జనగామ, ఖమ్మం జిల్లాల్లో ముగ్గురేసి, వరంగల్ అర్బన్‌లో ఇద్దరు చనిపోయారు. బాధిత కుటుంబ సభ్యులకు అందాల్సిన ప్రయోజనాలను యుద్ధ ప్రాతిపాదికన చెల్లిస్తాం’’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో కరోనాతో 177 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారని ప్రభుత్వం తెలిపింది. వీరి సంక్షేమం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. ‘‘అనాథలుగా మారిన పిల్లలకు మూడేళ్లపాటు నెలకు రూ.2 వేలు అందిచనున్నాం. జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల పూర్వ వివరాలు తెలియని చిన్నారులు బీసీ రిజర్వేషన్లు పొందేలా బీసీ-ఏ ధ్రువీకరణ పత్రం ఇప్పించనున్నాం. విద్యాసంస్థల్లో మూడుశాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. అత్యవసర సమయాల్లో రక్షణ కోసం పిల్లలకు సాధారణ ఫీచర్లతో కూడిన మొబైల్ ఫోన్లు అందించాం. అందులో 1098, 100, సహాయ కేంద్రం, సీడబ్ల్యూసీ సభ్యులు, డీసీపీయూ అధికారుల నంబర్లు నమోదు చేశాం. దీంతో ఆపద సమయాల్లో ఆయా చిన్నారులను రక్షించేందుకు వీలవుతుంది. కరోనాతో చనిపోయిన తల్లిదండ్రుల ఆస్తులపై హక్కుల కోసం బాధిత చిన్నారులకు న్యాయసహాయం అందించాలని న్యాయసేవా సంస్థను కోరాం’’ అని తెలిపింది.
10.34 లక్షల కేసుల నమోదు
కరోనా రెండోదశలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని 10.34 లక్షల కేసులు నమోదు చేశామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం రూ.41.27 కోట్లు జరిమానా విధించామని పేర్కొంది. నల్లబజార్లో కొవిడ్ మందులు, ఆక్సిజన్ వంటివాటిని అమ్ముతున్న వారిని గుర్తించి ఇప్పటి వరకూ 171 కేసులు నమోదు చేసినట్లు వివరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈనెల 1 నుంచి 20 వరకు 14,62,050 మందికి హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో అన్నపూర్ణ పథకం కింద ఉచిత భోజనం అందించామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.
ఇదీ చూడండి: టీకా విధానంపై వాగ్వాదం.. చర్చకు విపక్షాల పట్టు!