దేశవ్యాప్తంగా దాదాపు 200 ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. దక్షిణ మధ్య రైల్వే 17 ప్రత్యేక రైళ్లు కావాలని రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. ఈ జాబితాకు ఒకట్రెండు రోజుల్లో ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. గౌతమి, నర్సాపూర్, నారాయణాద్రి, చార్మినార్, శబరి, గువాహటి ఎక్స్‌ప్రెస్‌లతోపాటు మరో 11 రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతోపాటు బెంగళూరు, ఇతర నగరాలు, పట్టణాల్లో స్థిరపడ్డవారు పండగలకు సొంత ఊళ్లకు వెళ్లనున్నారు.
హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బిహారీలు ఛాత్ పండక్కి స్వరాష్ట్రానికి వెళ్తారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్‌కుమార్‌యాదవ్ సెప్టెంబరు 30న అన్ని జోన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి ఏయే రూట్లలో రద్దీ ఉంటుంది.. అదనంగా ప్రవేశపెట్టాల్సిన ప్రత్యేక రైళ్లపై చర్చించారు. పండగల నేపథ్యంలో మరో 200 ప్రత్యేక రైళ్లు వచ్చే అవకాశం ఉందని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. వీటిని వెంటనే ప్రకటించి రిజర్వేషన్లు ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.
అందుబాటులోకి రానున్న రైళ్లు ఇవే!
సికింద్రాబాద్ - తిరువనంతపురం, సికింద్రాబాద్ - గువాహటి, సికింద్రాబాద్ - తిరుపతి, సికింద్రాబాద్ - కాకినాడ, సికింద్రాబాద్ - నర్సాపూర్, హైదరాబాద్ - చెన్నై, కాచిగూడ - మైసూర్, కడప - విశాఖపట్నం, పూర్ణ - పట్నా, సికింద్రాబాద్ - రాజ్‌కోట్, విజయవాడ - హుబ్బళి, హైదరాబాద్ - జైపుర్, హైదరాబాద్ - రాక్సల్, తిరుపతి - అమరావతి (మహారాష్ట్ర), నాగ్‌పుర్ - చెన్నై, సికింద్రాబాద్ - హావ్‌డా, భువనేశ్వర్ - బెంగళూరు
ఇదీ చదవండి: 'బాగా పనిచేస్తే దుబ్బాక స్థానం కాంగ్రెస్‌దే'