రానున్న ఐదేళ్లకు రాష్ట్రాలకు నిధులు ఇచ్చేందుకు ఏర్పాటైన 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక సమర్పించింది. కమిషన్ నివేదిక ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వనుంది. నివేదికలోని సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు అందనున్నాయి. స్థానిక సంస్థలు, విపత్తు నిర్వహణతో పాటు ఇతర నిధులు రానున్నాయి.
పట్టణాలకు వాటా తగ్గింది...
కమిషన్ సిఫారసుల ప్రకారం 2020- 21లో రాష్ట్రానికి రూ. 4,079 కోట్లు అందనున్నాయి. గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు రూ.1,847 కోట్లు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు రూ. 889 కోట్లు రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గ్రామాలకు నిధులు కొంత మేర పెరగనుండగా... పట్టణాలకు తగ్గనున్నాయి. విపత్తు నిర్వహణకు రూ. 449 కోట్లు ఇవ్వనున్నారు.
అంగన్వాడీల ద్వారా పిల్లలు, గర్భిణీలకు అదనంగా పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. రాష్ట్రానికి సంబంధించి ఆరేళ్లలోపు 15 లక్షల మంది పిల్లలు, 19 లక్షల మంది గర్భిణీలకు ప్రయోజనం కలిగేలా రూ.171 కోట్లు సిఫారసు చేశారు. కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదల, రెవెన్యూ లోటు వల్ల ఇవ్వనున్న ప్రత్యేక గ్రాంటులో రాష్ట్రానికి రూ. 723 కోట్లు రానున్నాయి.
ఇదీ చూడండి:- బడ్జెట్‌పై భాజపా హర్షం... మోదీ-నిర్మలపై ప్రశంసల వర్షం