Foreigners Couples Travel Across the World: వృద్ధాప్యంలో తీర్థయాత్రలకు వెళ్లడం సహజం. మనకున్న ఆర్థిక వనరులతో పరిమితమైన దూరంలో.. వారం పదిరోజుల యాత్ర చేయగలుగుతాం. కానీ ఆ విదేశీయులు మాత్రం ఏకంగా 365 రోజులపాటు యాత్ర చేసేందుకు పయనమయ్యారు. ఏదో ఒక దేశంలో కాదు. ఏకంగా 18 దేశాల్లో 50 వేల కిలోమీటర్ల దూరాన్ని చుట్టుముట్టి రావాలనుకొని బయలు దేరారు.
టర్కీలోని ఇస్తాన్‌బుల్ నుంచి బయలుదేరిన వీరు.. ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, భూటాన్, మయన్మార్, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జర్మనీ, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా.. ఇలా పలు దేశాలకు చెందిన వీరంతా ఖండాంతర పర్యటన చేస్తున్నారు. వీరంతా 60 ఏళ్లు దాటిన వృద్ధులే. భార్య, భర్త కలిపి ఓ జంటగా.. మొత్తం 33 మంది యాత్రలో పాల్గొంటున్నారు.
ఒక్కో జంటకు ఒక్కో కారవాన్ ఏర్పాటు చేసుకున్నారు. సకల సౌకర్యాలు ఉండే ఈ కారవాన్‌లను కూడా వారి దేశాల నుంచే తెచ్చుకున్నారు. సముద్రాలు దాటాల్సి వస్తే ఓడల్లో వీటిని తీసుకెళ్తారు. వీరికి ప్రత్యేకంగా డ్రైవర్లు ఉండరు. భార్య, భర్త ఇద్దరూ డ్రైవింగ్ చేస్తారు. ఓ టూర్ గైడ్ మాత్రం ఉంటాడు. నేవిగేషన్ సౌకర్యంతో రోజంతా రహదారిపై ప్రయాణం చేస్తూ రాత్రికి ఏదో ఒక ఊర్లో బస చేస్తారు. కాలకృత్యాలు, భోజనాలు, పడక ఏర్పాట్లు అన్నీ కారవాన్‌లోనే ఉంటాయి. దాదాపు 16 కారవాన్లు ఒకే చోట ఉండటం అందరినీ ఆకట్టుకుంటుంది.
"మేం యాత్రికులం. మేం ప్రపంచమంతా చుట్టిరావాలని అనుకుంటున్నాం. ప్రపంచంలో వివిధ దేశాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన శైలి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అందరితోనూ స్నేహం చేయాలనుకుంటున్నాం. మా ప్రయాణం 18 దేశాల గుండా సాగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదంత సులభమేమీ కాదు. కానీ మేం అన్నింటినీ అధిగమించి ఈ యాత్ర పూర్తిచేస్తాం" -విదేశీయురాలు
ప్రపంచ యాత్ర చేయడం ఓ మధురానుభూతిని మిగిలిస్తుందని ఈ యాత్రికులు అభిప్రాయపడ్డారు. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సంస్కృతి, వాతావరణం, జీవన శైలి ఆకట్టుకుంటున్నాయన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆదరణ తమకు ఎంతగానో నచ్చాయని చెప్పారు.
"నా పేరు అవిన్. నేను స్విట్జర్లాండ్ నుంచి వచ్చాను. ఈ బృందంలో నేను సభ్యురాలిని. యూరప్ నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణం సాగిస్తున్నాము. నేను, నా భర్త ఇద్దరమూ డ్రైవింగ్ చేస్తాం. నేను కాసేపు, ఆయన కాసేపు ఇలా మొత్తం డ్రైవింగ్ చేసుకుంటూ స్విట్జర్లాండ్ నుంచి ఇండియా వరకు వచ్చాం" -అవిన్, విదేశీయురాలు
విదేశీ పర్యాటకులకు ఒంగోలులో చక్కటి ఆతిథ్యం లభించింది. స్థానికులు వీరిని స్వాగతించి.. వసతి ఏర్పాట్లు చేసి అల్పాహారం అందించారు. విదేశీ దంపతుల పర్యటన సాహసోపేతంగా ఉందంటున్నారు ఒంగోలువాసులు.. వృద్ధాప్యాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ఈ విదేశీయులు చేపట్టిన సుదూర యాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది.
"ఇప్పుడు మేం ఆస్ట్రేలియా దిశగా సాగుతున్నాం. మా లక్ష్యం సుమారు 50వేల కిలోమీటర్లు. ఇప్పటికే సగానికి పైగా అధిగమించాం. భారత్‌లో ఇక్కడి ప్రజల ఆదరణ బాగుంది. ఇక్కడ ప్రజల సంఖ్య ఎక్కువ. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది" -విదేశీయురాలు
ఇవీ చదవండి: