కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోంది. మానసికంగా కుంగదీస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు సాధారణ ప్రజలు మొదలుకొని... ప్రజా ప్రతినిధుల వరకు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30వేల మార్కును దాటింది. గురువారం మొత్తం 5,954 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1,410 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30,946 మందికి వైరస్ సోకింది. వీరిలో ఇప్పటికే 18,192 మంది కోలుకోగా.. మరో 331 మంది మృతి చెందారు. ప్రస్తుతం 12,423 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో 918..
గురువారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 918, రంగారెడ్డిలో 125, మేడ్చల్ 67... సంగారెడ్డి 79, వరంగల్ అర్బన్ 34, కరీంనగర్ 32, భద్రాద్రి కొత్తగూడెం 23, నల్గొండ 21, నిజామాబాద్ 18, సూర్యాపేటలో 10 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గ్రేటర్ పరిధిలో విజృంభణ..
జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ మరింత విజృంభిస్తున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో మార్చి 2న తొలి కేసు నమోదు కాగా.. నెల 31నాటికి రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య కేవలం 76. ఏప్రిల్ నెలలో మొత్తం 492 కేసులు రికార్డు కాగా.. అప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 568కి చేరింది. మే చివరి నాటికి ఆ సంఖ్య కాస్తా .. 2,698కి చేరింది. జూన్ 1 నుంచి 30 వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 13,741. జూన్ నెలాఖరుకి రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 16,339 చేరుకుంది. అంటే జూన్ నెలలో సగటున రోజుకి 454 మందికి కరోనా సోకినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
9 రోజుల్లో.. 14,607 కేసులు..
రికార్డులను తిరగరాస్తూ.. గడచిన పది రోజుల్లో కరోనా మహమ్మారి కేసులు భారీగా వెలుగుచూశాయి. ఈనెల 1 నుంచి 9 వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30,946కి చేరింది. అంటే రాష్ట్రంలో 9 రోజుల్లో నమోదైన కేసుల సంఖ్య 14,607. అంటే జూన్ నెలతో పోలిస్తే దాదాపు 3 రెట్లు అధికంగా కేసులు వెలుగుచూస్తున్నట్టు స్పష్టమవుతోంది. జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు 24,141 కేసులు నమోదయ్యాయి. అంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు మూడొంతులు.. గ్రేటర్ పరిధిలోనివే కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇవీ చూడండి: 'మహా' విజృంభణ: కొత్తగా 6,875 కేసులు, 219 మరణాలు