ఆంధ్రప్రదేశ్లోని ప్రధానమైన 5 నదుల్లో రోజూ 14 కోట్ల లీటర్ల మురుగు నీరు కలుస్తోంది. వాటి పక్కనే ఉన్న నగరాలు, పట్టణాల్లో నుంచి వచ్చే మొత్తం 30.2 కోట్ల లీటర్ల నీటిలో నుంచి 54 శాతమే శుద్ధి చేస్తున్నారు. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే మురుగు నీటిని శుద్ధి చేసే ప్రక్రియ రెండడుగులు ముందుకు, నాలుగు అడుగుల వెనక్కి అన్నట్లుగా తయారైంది. ఇప్పటికే ఉన్న 11 మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టీపీ) పూర్తిస్థాయిలో పని చేయడం లేదు. మరో 6 కొత్త ఎస్‌టీపీల పనులు నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచాయి.
రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలు, నంద్యాల, శ్రీకాకుళం నుంచి వచ్చే మురుగును శుద్ధి చేయకుండానే చాలావరకు నేరుగా గోదావరి, కృష్ణా, తుంగభద్ర, కుందు, నాగావళి నదుల్లోకి వదులుతున్నారు. ఈ విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఇది వరకే గుర్తించింది. దేశవ్యాప్తంగా 351 నదుల్లో ఇలాంటి సమస్య ఉన్నట్లు ప్రకటించింది. ఆయా నదుల నీటిలో బీఓడీ పరిమితికి మించి ఉంటోందని హెచ్చరించింది. బీఓడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండు) అంటే... జలకాలుష్యానికి కొలమానం. ఇందులో ఆక్సిజన్ డిమాండు ఎంత ఎక్కువ ఉంటే... అంత స్థాయిలో కాలుష్యం అధికంగా ఉందని అర్ధం. వాడకానికి ఉపయోగించే నీటిలో ఇది గరిష్ఠంగా లీటరుకు 3 మిల్లీ గ్రాముల వరకు అనుమతిస్తారు. అదే పురపాలక సంఘాలు, నగరాల నుంచి వెలువడే వ్యర్థ జలాల విషయానికి వస్తే... లీటరుకు 200 మి.గ్రా నుంచి 400 మి.గ్రా వరకు ఉంటుంది. ఎస్‌టీపీ ద్వారా దీన్ని 30 వరకు తగ్గించి బయటకు వదులుతారు. పరిశ్రమలకు అనుగుణంగా బీఓడీ మారుతుంటుంది. డిస్టిలరీల నుంచి వెలువడే వ్యర్థాల్లో అత్యధికంగా 50 వేల మి.గ్రా. వరకు ఉంటుంది. డెయిరీ పరిశ్రమల నుంచి వెలువడే నీటిలోనూ 3 వేల మి.గ్రా. వరకు ఉంటుంది.

225 మండలాలకు ఇదే నీటి సరఫరా
అయిదు నదుల నుంచి ఏడు జిల్లాలకు చెందిన 225 మండలాల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. వీటిలో పుర, నగరపాలక సంస్థలు, పంచాయతీలకు చెందిన ఇన్‌ఫిల్ట్రేషన్ బావులు, ఇతర తాగునీటి పథకాలు ఉన్నాయి. శుద్ధి చేయని మురుగు నీటిని నేరుగా నదుల్లోకి విడిచిపెట్టడంతో ఈ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై కచ్చితంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి కొన్ని పంచాయతీల్లో ఫిల్టర్ బెడ్లు సరిగా పనిచేయని కారణంగా నదుల నీటిని ఓవర్‌హెడ్ ట్యాంకుల్లోకి పంప్ చేసి, ప్రజలకు నేరుగా సరఫరా చేస్తున్నారు. ఇలాంటిచోట్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ సమస్య కృష్ణా, గోదావరి, నాగావళి నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటోంది.

ఉన్నవి పనిచేయవు.. కొత్తవి సాగవు
అయిదు నదుల్లో రోజూ కలుస్తున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు ప్రస్తుతమున్న 11 నీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టీపీ) పూర్తిస్థాయిలో పని చేయడం లేదు. వీటి సామర్థ్యంలో 70 నుంచి 75 శాతమే నీటి శుద్ధి జరుగుతోంది. ఈ కారణంగా విజయవాడలోని కొన్నిచోట్ల మ్యాన్‌హోళ్ల నుంచి మురుగు నీరు రోడ్లపైకి వస్తోంది. రాజమహేంద్రవరంలో ఒక్కటే ఎస్‌టీపీ ఉండటంతో మురుగునీటి మొత్తాన్ని శుద్ధి చేయడంలేదు. కర్నూలులో రోజూ ఆరు కోట్ల లీటర్ల మురుగు నీటికి కేవలం 24 లక్షల లీటర్లే శుద్ధి చేస్తున్నారు. శ్రీకాకుళంలో కొత్తగా కోటి లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం కలిగిన ఎస్‌టీపీ నిర్మాణం... నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయింది. నంద్యాలలో రెండుచోట్ల కోటి లీటర్ల సామర్థ్యం కలిగిన ఎస్‌టీపీ పనులకు శుంకుస్థాపన చేసినా పనులు మొదలు కాలేదు. విజయవాడలోని జక్కంపూడిలో రెండు కోట్ల లీటర్ల సామర్థయమున్న మరో ఎస్‌టీపీ కూడా నిధుల లేమితో ఆగిపోయింది. కర్నూలు జిల్లాలో హంద్రీనీవా వద్ద మరో ఎస్‌టీపీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాజమహేంద్రవరంలోనూ 50 లక్షల లీటర్ల సామర్థ్యమున్న ప్లాంట్ పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి.
ఇదీ చదవండీ: వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన కార్లు.. నవవధువు సహా ఆరుగురు గల్లంతు