రెండేళ్ల క్రితం అందరి పిల్లల్లాగే మొబైల్, ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు... కనిపించిన ప్రతీ సాఫ్ట్‌వేర్‌ని నేర్చుకునేవాడు. ప్రతిభను గుర్తించిన తండ్రి.. ప్రోత్సహించాడు. అసమాన ప్రతిభను ఇంజినీరింగ్ సాఫ్ట్వేర్ల వైపు మళ్లించాడు. నాటి ముందుచూపు నేడు 1000 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు గురువును చేసింది. ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థల్లో అతిథి అధ్యాపకుడిగా చేస్తూ...బాల మేధావి పురస్కారాలు సొంతం చేసుకున్న అతనే హైదరాబాద్‌కు చెందిన హసన్ అలీ.
విద్యార్థులకు బోధన
మలక్‌పేటలోని ఇంటిగ్రల్ ఫౌండేషన్ పాఠశాలలో చదువుతున్న అలీ... స్కిల్ ఇండియా లెర్న్ క్రియేటివ్ అండ్ ఎడ్యుకేట్ సంస్థలో రోజుకు రెండు గంటలు 30 మందికి పైగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. తెలంగాణలోని 35 ఇంజినీరింగ్ కళాశాలలే కాక... ఆఫ్రికా, నైజీరియా, ఉగాండాకు చెందిన విద్యార్థులూ శిక్షణ తీసుకోవడం గమనార్హం.
ఆశ్చర్యపరుస్తున్న హసన్
బీటెక్ పూర్తి చేసిన యువత ఇంజినీర్లుగా రాణించలేకపోతున్నారని తెలుసుకున్న అలీ... వారి కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు. అంతర్జాలంలో సాంకేతిక డిజైనింగ్‌కు సంబంధించిన 35 సాప్ట్వేర్లను నేర్చుకొని శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. హైదరాబాద్, చెన్నైకి చెందిన పలు కళాశాలల్లో ఉపన్యాసాలిస్తూ...అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. హసన్ ప్రతిభను మెచ్చుకున్న పలు విద్యాసంస్థలు బాలమేధావి వంటి పురస్కారాలతో సత్కరించాయి.
అందరికి ఆదర్శం
పాఠాలు చదవాల్సిన వయసులో... అందరికీ అర్థమయ్యే రీతిలో శిక్షణ ఇస్తున్న తీరుపట్ల విద్యార్థులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన వయసు పిల్లలతో పాటు విద్యావంతులకూ... చక్కటి సూచనలు చేస్తున్న ఈ కుర్రాడి మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
త్వరలో ఏరోనాటిక్స్, పెట్రోలియం, ఆటోమొబైల్, కంప్యూటర్ ఇంజినీర్లకూ శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ప్రతిభకు సానబెడుతున్నాడు హసన్ అలీ. ప్రపంచ స్థాయిలో విలువలతో కూడిన విద్యను అందించడమే ధ్యేయమని గర్వంగా చెబుతున్నాడు.
ఇదీ చూడండి :నన్నూ సిద్ధార్థలాగే వేధిస్తున్నారు: విజయ్ మాల్యా