Chlorine Pipe Leak in Swimming Pool : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గాంధీనగర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్‌లో క్లోరిన్ పైప్ లీకేజీ కలకలం రేపింది. పైపు లీకేజీ కావటంతో సుమారు 10 మంది క్రీడాకారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు చిన్నారులు ఉన్నారు. వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెయిన్ బో, కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ నెల 10, 11 తేదీల్లో సౌత్ ఇండియా స్విమ్మింగ్ పోటీలు జరగనున్నాయి. దీంతో క్రీడాకారులు సాధన చేస్తున్న సమయంలో హఠాత్తుగా క్లోరిన్ పైప్ లీకైందని అధికారులు చెబుతున్నారు. సకాలంలో స్పందించిన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు క్రీడాకారులను పూల్ నుంచి బయటకు తీయటంతో ప్రాణాపాయం తప్పిందని స్విమ్మర్స్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన స్విమ్మర్స్ ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు మున్సిపల్ ఫైర్ ఆఫీసర్ ఘటన జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు.
గాంధీనగర్ స్విమ్మింగ్ పూల్‌ను ఇటీవల ఆధునీకరించారు. ఒలింపిక్ స్థాయి పూల్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు ఐదేళ్ల కిందట ఇలాంటి ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. నగరంలో మొత్తం మూడు స్విమ్మింగ్ పూల్స్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్నాయని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: