BJP MEETING: జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన పనులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే భూమి పూజ నిర్వహించి.. సభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జులై 3న సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తామన్న సంజయ్.. అందుకోసం భూమి పూజ నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో భాజపా పాలసీ ప్రకటించడానికి, ప్రజలను చైతన్యం చేయడానికే ఈ సభ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
తుక్కుగూడలో అమిత్ షా, పాలమూరులో జేపీ నడ్డాల సభ చూసిన ప్రజలు.. ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో ప్రధాని నరేంద్రమోదీ సభ చూస్తారని బండి సంజయ్ పేర్కొన్నారు. దాదాపు 10 లక్షల మందిని సభకు తరలించాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. ఇందుకోసం ఇప్పటికే పోలింగ్ బూత్, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహించినట్లు సంజయ్ తెలిపారు. కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి..: రాష్ట్రంలో మార్పు కోసం భాజపా పని చేస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా భాజపాను కట్టడి చేయాలి, ఇబ్బంది పెట్టాలని సీఎంవో కార్యాలయంలో ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారన్న ఆయన.. ప్రజలే పట్టించుకోవడం మానేసిన సీఎం గురించి తమ పార్టీ పట్టించుకోదన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు సీఎం కేసీఆర్ పరిస్థితి తయారయ్యిందని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తున్నాం. సభకు సుమారు 10 లక్షల మంది జనసమీకరణ చేస్తున్నాం. సభ విజయవంతం కోసం బూతు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కమిటీలు వేశాం. రాష్ట్రంలో మార్పు కోసం పనిచేస్తున్న భాజపాకు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. మా పార్టీని కట్టడి చేయాలని సీఎంవో కార్యాలయంలో ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. అయినా ఏం చేయలేకపోయారు. సీఎంను ప్రజలే పట్టించుకోవడం లేదు. భాజపా కూడా పట్టించుకోదు.-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చూడండి..
కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవటంపై ఎన్హెచ్ఆర్సీకి బండి సంజయ్ ఫిర్యాదు