ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలపై సమీక్ష
34 నియోజకవర్గాల్లో ఎన్నికల పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించిన యంత్రాలను వాడే అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్ నుంచి కొన్ని, ఈసీఐఎల్ నుంచి కొత్త ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను కేటాయించారు. ఇవి రాగానే 12లోపు మొదటి దశ తనిఖీ పూర్తి చేయాలని కలెక్టర్లకు సీఈఓ స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో కేవలం బెంగళూరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) యంత్రాలను వినియోగించారు. ఈసారి బెల్‌తో పాటు ఈసీఐఎల్ యంత్రాలను కూడా వినియోగిస్తున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఒక్కో జిల్లాకు ఒక కంపెనీ యంత్రాలను వినియోగిస్తున్నారు.
అర్హులు ఎవరూ నష్టపోవద్దు: రజత్ కుమార్
ఓటర్ల జాబితాల విషయమై కలెక్టర్లతో రజత్ కుమార్ సమీక్షించారు. డబుల్ ఎంట్రీలు, ఇతర కారణాల దృష్ట్యా ఏడు నుంచి ఎనిమిది వేల ఓట్లు తొలగించాల్సి ఉంది. అయితే ఈ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు సీఈఓ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. అర్హులు ఎవరూ నష్టపోకుండా చూడాలని కలెక్టర్లకు ఆయన సూచించారు.
భద్రతపై దృష్టి పెట్టండి...
జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికపైనా సమీక్షించారు. స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కీలకమైన, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో భద్రత అంశాలపై దృష్టి సారించాలని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఎప్పుడైనా షెడ్యూల్ ప్రకటించవచ్చని... అందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:లెక్క చూసుకుందాం రండి: ప్రభాకర్‌రావు