తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన టీఆర్టీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వీరి దీక్షకు వివిధ రాజకీయ పార్టీల నుండి విశేష స్పందన వచ్చింది. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, పీఆర్టీయూ నేతలు సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అనేక ఖాళీలు ఉన్నా పూర్తి స్థాయిలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రకటనలు చేయకుండా కొన్ని పోస్టులను మాత్రమే తూతూమంత్రంగా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు.
ఎన్నికలకు ముందు కేసీఆర్, సంబంధిత మంత్రులు ఉపాధ్యాయుల విషయంలో చేసిన ప్రకటనను ఒకటి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఉపాధ్యాయుల భర్తీలో జరుగుతున్న అలసత్వం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చెశారు. ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శుభవార్త