అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైనా.. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా గురిచూసి కొట్టింది. రాష్ట్రంలో 17 సీట్లలో పోటీ చేసినా.. ముఖ్యంగా పార్టీకి క్యాడర్, పేరున్న 5 చోట్ల ప్రత్యేక దృష్టి సారించింది. బలమున్న అభ్యర్థులను బరిలో నిలిపింది. సికింద్రాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డి టికెట్ ఆశించినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కిషన్ రెడ్డికే అవకాశం కల్పించి సికింద్రాబాద్‌ను తన ఖాతాలో వేసుకుంది కమలం పార్టీ.
బండిపై నమ్మకం..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ గట్టి పోటీ ఇచ్చారు. అంతకుముందుకు కూడా ఇక్కడ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. అతనిపై సానుభూతి, స్థానికంగా యువతలో ఉన్న క్రేజ్ వల్ల సంజయ్‌కు టికెట్ ఇచ్చింది భాజపా అధిష్ఠానం. ఈసారైనా గెలవాలన్న కసితో బండి విస్తృత ప్రచారం చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
రెండేళ్లే అయినా...
తెలంగాణలో బలమైన బీసీ నాయకుడిగా పేరొందిన డీఎస్ తనయున్ని భాజపా నిజామాబాద్ బరిలో నిలిపింది. అర్వింద్ పార్టీలో చేరి రెండేళ్లే అయినా నియోజవర్గ పరిధిలో చురుగ్గా తిరుగుతూ పసుపుబోర్డు, చక్కెర కర్మాగారం వంటి అంశాలతో రైతులకు దగ్గరయ్యారు. కేసీఆర్ కూతురు కవితపై అనూహ్య విజయం సాధించారు.
ఆదివాసీ ఉద్యమనేతను బరిలో దింపి..!
ఆదిలాబాద్‌లో ఆదివాసీ ఓటర్లు భారీగా ఉండడం వల్ల... వారి హక్కుల కోసం పోరాటం చేసిన ఉద్యమ నేత బాపూరావును కొద్దిరోజుల ముందు పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం భాజపాకు కలిసొచ్చింది. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ నేత డీకే అరుణను పార్టీలోకి తీసుకుని పోటీ చేయించింది. అక్కడ ఆమె పోటీ ఇచ్చినా గెలవలేకపోయారు. మొత్తానికి కాషాయం గురి చూసి స్థానాలు సాధించింది.
ఇవీ చూడండి: గతం కన్నా ఘనంగా కమల వికాసం