వచ్చే ఆర్థిక సంవత్సరానికి 'ఓట్ ఆన్ అకౌంట్' బడ్జెట్‌ను ఈ నెలాఖరులోపు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా కసరత్తు కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు మరో మూడేళ్లు సర్వీస్‌లో ఉండేందుకు పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతామని ఎన్నికల్లో తెరాస హామీ ఇచ్చింది. అయితే హామీని ఎప్పట్నుంచి అమల్లోకి తెస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.
తొందరపడకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. పదవీవిరమణ చేసే ఉద్యోగులకు చేసే తుది చెల్లింపులు ఏటా రూ.3000 కోట్లు పైనే ఉంటాయి. వయస్సు పెంచి వేతన సవరణ అమలైతే చెల్లింపుల భారం రూ.5000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో పదవీ విరమణ చేసే వారి స్థానంలో కొత్తవారిని ముగ్గురిని తీసుకోవచ్చన్న వాదన కూడా ఉంది. బడ్జెట్ లో ఇందుకు సంబంధించిన ప్రస్తావన తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఏ నెలలో ఏ ఉద్యోగి పదవీ విరమణ చేస్తున్నారన్న వివరాలనూ ఆర్థిక శాఖ సేకరిస్తోంది. ఉద్యోగులకు చేయాల్సిన చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండడం కోసమే ఈ కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి.