నల్గొండ లోక్‌సభ పోరు ఆసక్తిగా మారింది. మూడుదశాబ్దాల రాజకీయ అనుభవమున్న వ్యక్తితో ముగ్గురు కొత్త వ్యక్తులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బరిలో ఉండగా..ఎలాంటి రాజకీయ నేపథ్యం కానీ, నియోజకవర్గంతో సంబంధాలు లేని వ్యక్తి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తెరాస నుంచి టికెట్ దక్కించుకున్నారు. భాజపా నుంచి ఆరెస్సెస్ కార్యకర్త పోటీలో ఉండగా..తొలి మహిళా అభ్యర్థి మల్లు లక్ష్మి సై అంటున్నారు.
పట్టు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్
లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లకుగాను ఆరు స్థానాల్లో తెరాస ఎమ్మెల్యేలు గెలుపొందారు. దీంతో నల్గొండ పార్లమెంట్లో తిరిగి పట్టు సంపాదించడానికే కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని బరిలో దింపింది. హుజూర్నగర్, కోదాడ నుంచి వరుసగా ఐదుసార్లు గెలుపొందారు ఉత్తమ్. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఈ పార్లమెంటు పరిధిలో ఉండటం కలిసొచ్చే అంశమే అయినా వీరి మధ్య వర్గపోరు అవరోధంగా మారాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, పీసీసీ అధ్యక్షుడిగా ప్రజలందరికి సుపరిచితుడుగా ఉత్తమ్‌కి ప్లస్ పాయింట్. ప్రత్యర్థి తొలిసారి పోటీ చేస్తుండటం బోనస్. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక క్షేత్రస్థాయి కార్యకర్తలతో సంబంధాలు లేవనే అపవాదు ఉంది.
ఉత్తమ్‌తో ఢీకొంటున్న వ్యాపారి
అధికార పార్టీ నుంచి స్థిరాస్తి వ్యాపారి, రాజధాని బ్యాంక్ ఛైర్మన్ వేమిరెడ్డి నర్సింహారెడ్డి తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా తెరాస గాలి వీచినా ఇక్కడ మాత్రం గులాబీ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇప్పటి వరకు విజయం సాధించకపోవటంతో నల్గొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగురేయాలని తెరాస నాయకులు తహతహలాడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వపథకాలు, అగ్రవర్ణాలు, బీసీల్లో పార్టీకున్న పట్టు, కాంగ్రెస్‌లో వర్గపోరు కలిసొచ్చే అంశాలు. నియోజకవర్గానికి కార్యకర్తలకు కొత్త వ్యక్తి కావటం, తొలిసారి బలమైన ప్రత్యర్థితో పోటీకి దిగడం కొంత ఇబ్బందికరమే.
ఆరెస్సెస్ కార్యకర్తే అభ్యర్థి
భాజపా అభ్యర్థిగా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన ఆరెస్సెస్ కార్యకర్త, బియ్యం వ్యాపారి గార్లపాటి జితేందర్ టికెట్ దక్కించుకున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న ఈయనా..పీసీసీ అధ్యక్షుడినే ఢీకొంటున్నారు. ప్రధాని మోదీ ఛరిష్మాపైనే భాజపా పూర్తి నమ్మకం పెట్టుకుంది.యువత, తటస్థ ఓటర్లు భాజపాకు ఓటు వేస్తారనినమ్మకంతో ఉంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం లేకపోవటం, ప్రతికూలాంశాలు.
తొలి మహిళా అభ్యర్థి
సీపీఐతో పొత్తులో భాగంగా నల్గొండ నుంచి సీపీఎం పోటీ చేస్తోంది. సీపీఎం కేంద్రకమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం కోడలు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పోటీ చేస్తున్నారు. నల్గొండ ఎంపీ స్థానం 1952లో ఏర్పడగా.. ఓమహిళా అభ్యర్థి పోటీలో ఉండటం ఇదే ప్రథమం. నల్గొండ, నకిరేకల్, కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఎర్రదండు ఓటు బ్యాంకు ఉంది.
>>