అటవీ హక్కులు, పోడు వ్యవసాయం వంటి సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఐదో విడత హరితహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. నర్సరీల్లో మొక్కల లభ్యత, చేపట్టాల్సిన ప్లాంటేషన్‌పై శాఖలు, జిల్లాల వారీగా సమీక్షించారు. నాలుగు విడతల్లో నాటిన మొక్కల్లో ఎంత శాతం ఉన్నాయని ఆరా తీశారు. నాటిన మొక్కలను కాపాడుకుంటేనే హరితహారం కల నెరవేరుతుందన్నారు.
మండలానికో నోడల్ అధికారి
హరితహారంలో జవాబుదారీతనం పెంచేందుకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని నిర్ణయించారు. నర్సరీల్లో పెంచిన మొక్కలను మరో మారు అధికారులు పరిశీలించి తగిన ఎత్తులో ఉన్న మొక్కలనే ఈ ఏడాది నాటాలని మంత్రి స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు నాటిన మొక్కల పెంపు బాధ్యత తీసుకోవాలని.. వారంలో ఒకరోజు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు. మొక్కలు నాటుతున్న ప్రదేశాలను జియో ట్యాగింగ్ చేయాలని... తద్వారా పర్యవేక్షణ సులువవుతుందన్నారు.
సిద్దిపేటే రోల్‌మోడల్
సిద్దిపేట జిల్లా తరహాలో అన్ని గ్రామాల రహదారి మధ్యలో వనాలు పెంచేందుకు అన్ని జిల్లాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. రెవెన్యూ రికార్డులతో, అటవీ భూముల దస్త్రాలను సరిచూడాలన్నారు. అటవీ భూములను నోటిఫై చేసే ప్రక్రియను నెలాఖరుకల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్, ములుగు, జయశంకర్ పాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న 16 లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డుల పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: 'ఆనకట్ట కూల్చిన పీతలను అరెస్టు చేయండి'