సార్వత్రిక ఎన్నికలకు ఇవాళ సాయంత్రం షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన తెరాస, కాంగ్రెస్ సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించాయి.
గెలుపుపై తెరాస ధీమా
పార్లమెంటరీ సన్నాహక సభల పేరుతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు. కార్యకర్తలను, నాయకులను సమాయత్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల బాధ్యతలను కేటీఆర్ ఒక్కరే భుజానికెత్తుకున్నారు. మిగితా కీలక నేతలంతా కేటీఆర్‌కు సహకారం అందిస్తున్నారు. 16 పార్లమెంట్ సీట్లు గెలవడమే ధ్యేయంగా కార్యాచరణ సాగుతోంది. మొన్నటి ముందస్తు ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని తెరాస ధీమాగా ఉంది.
మోగిన హస్తం ఢంకా
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సైతం లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. కాంగ్రెస్ సారథి రాహుల్ గాంధీ శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన సభలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు. రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యంగా టీ కాంగ్రెస్ సమరానికి సిద్ధమవుతోంది.
వీరు ఒంటరి పోరే
తమకు పట్టున్న స్థానాల్లో పోటీ చేసి ఉనికి కాపాడుకునే ప్రయత్నాల్లో భాజపా ఉంది. అదే తరహాలో తమకు బలమున్న ఒకటి రెండు స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగే ఆలోచనలో ఉంది సైకిల్ పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా జట్టు కట్టినా... ఈసారి ఆ ప్రయత్నాలేమి కనిపించడం లేదు. మిగిలిన తెజస, వామపక్షాలు కూడా వాటి శక్తి మేరకు పోటీకి తయారవుతున్నాయి. ఎంఐఎం హైదరాబాద్ సీటులో పోటీ చేస్తూ మిగిలిన చోట్ల తెరాసకు మద్దతు ఇవ్వనుంది.
ఇవీ చూడండి:'సమర భేరి' సాయంత్రమే...