జైళ్ల డీజీ వినయ్ కుమార్ సింగ్ బదిలీ అయ్యారు. ప్రింటింగ్ కమిషనర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్లశాఖ ఇన్ఛార్జి డీజీగా రైల్వే అదనపు డీజీ సందీప్ శాండిల్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రింటింగ్ కమిషనర్గా ఇదివరకు తేజ్ దీప్ కౌర్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి వినయ్ కుమార్ సింగ్కు అప్పగించారు.
ఇతర శాఖలకు ఆదర్శంగా నిలిపిన వ్యక్తి...
గత ఐదేళ్లుగా జైళ్లశాఖ డీజీ గా వ్యవహరించిన వీకే సింగ్ ఆ శాఖలో పలు సంస్కరణలు చేపట్టారు. అవినీతిని నిరూపిస్తే నగదు బహుమానం అందిస్తానని ప్రకటించి ఇతర శాఖలకు ఆదర్శంగా నిలిచారు. ఖైదీలలో సత్ప్రవర్తన తెచ్చేందుకు పలు మార్పులు తీసుకొచ్చారు. జైళ్లశాఖ స్వయం సమృద్ధి సాధించేందుకు పెట్రోల్ బంకులు నిర్వహించడమే కాకుండా ఖైదీల ద్వారా పలు ఉత్పత్తులను తయారు చేపించి బహిరంగ విపణిలో విక్రయించారు. అనాథలను ఆదుకునేందుకు జైళ్ల శాఖ తరఫున ఆనంద ఆశ్రమం కూడా నిర్వహించారు. సామాజిక స్పృహతో చేపట్టిన ఈ కార్యక్రమం పలువురి మన్ననలు అందుకుంది. విదేశాలకు చెందిన కొంత మంది ప్రతినిధులు కూడా చంచల్ గూడ, చర్లపల్లి సందర్శించి అక్కడ అమలవుతున్న సంస్కరణల గురించి అధ్యయనం చేశారు.
వీకే సింగ్ను ప్రస్తుతం అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయడం పట్ల ఆ శాఖలో చర్చనీయాంశమైంది. వీకే సింగ్ కూడా బదిలీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం పట్నాలో ఉన్న వీకే సింగ్ రేపు హైదరాబాద్కు రానున్నారు. వ్యక్తిగత సెలవుపై వెళ్లిన ఆయనకు బదిలీ గురించి సమాచారమిచ్చారు.
ఇవీ చూడండి: పటిష్ఠమైన చట్టాలతోనే మెరుగైన సేవలు: కేసీఆర్