BRS Meeting on Parliament Elections 2024 : లోక్‌సభ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా భారత రాష్ట్ర సమితి మెదక్ నియోజకవర్గ సమావేశం జరుగుతోంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరుగుతున్న సమీక్షలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR), సీనియర్ నేతలు హరీశ్ రావు(Harish Rao), పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, ప్రశాంత్ రెడ్డి భేటీకి హాజరయ్యారు. శాసనసభ ఎన్నికల ఓటమిపై సమీక్షించి నేతల అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం అనుసరించాల్సిన కార్యాచరణపైనా సమాలోచనలు జరుపుతున్నారు.
KTR Comments on CM Revanth Reddy : తెలంగాణ అప్పులపాలైందని, రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు మాట్లాడించారని కేటీఆర్ అన్నారు. ఇది తప్పని నిరూపించేలా తెలంగాణ సమగ్ర అభివృద్ధిపై గణాంకాలు, ఆధారాలతో శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని, రూ.2 లక్షల రుణం తెచ్చుకోవాలని ప్రజలకు చెప్పారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
KTR Instructions to BRS Leaders : ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, అలాంటి హామీ ఏది ఇవ్వలేదని భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారని కేటీఆర్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru Ranga Reddy Project)కు జాతీయ హోదా తెస్తామని ఇచ్చిన హామీ కూడా సాధ్యం కాదని ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనలో స్పష్టమైందన్నారు. నోటికి ఎంత వస్తే అన్ని హామీలిచ్చారని ఈ 420 హామీలను అమలు చేసేదాకా విడిచి పెట్టమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాని, అదానీ ఒక్కటే అని విమర్శలు చేసిన రేవంత్ ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని మండిపడ్డారు. అదానీపై రాహుల్ విమర్శలు చేస్తుంటే అదే సమయంలో దావోస్‌లో రేవంత్ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.
BRS Meeting about MP Elections 2024 : కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతోందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలో క్రియాశీలకంగా పని చేసి గత ఎంపీ ఎన్నికల్లో మెదక్‌లో అత్యధిక మెజార్టీ సాధించామని కేటీఆర్ గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లోనూ మెదక్‌లో గులాబీ జెండా ఎగరబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. తమ బలం, తమ గళమైన గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలన్నారు. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందన్నారు.