ప్రజల సంక్షేమం, పిల్లల భవిష్యత్ కోసమే.. షర్మిల రాజకీయ ప్రవేశం చేశారని వైసీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ బాబు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో.. వైఎస్ఆర్ అభిమానులు నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏప్రిల్ 9వ తేదీన జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి గెలిచిన నాయకులు.. డబ్బు, అధికారం కోసం తెరాసలో చేరారని సుధీర్ బాబు విమర్శించారు. ఓటు సిరాచుక్క ఆరక ముందే.. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మారారని ఎద్దేవా చేశారు.
తెలంగాణాలోని వైఎస్సార్ అభిమానులు.. షర్మిలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వైసీపీ ఇల్లందు నాయకురాలు భానోత్ సుజాత తెలిపారు. ఈ కార్యక్రమంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నిరీక్షణకు తెర... పీఆర్సీపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేసే అవకాశం