భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ విద్యుత్కేంద్రం (కేటీపీఎస్) కాంప్లెక్స్‌లో తరచూ ఏదో ఒక చోరీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల ఓ ఎస్పీఎఫ్ ఉన్నతాధికారి ఇంటి అవసరాల నిమిత్తం ఓఅండ్‌ఎం స్టోర్ నుంచి కూడా రూ.51 వేల ఖరీదైన కలపను తరలించినట్లు విచారణలో తేలింది.సామగ్రి, కలప చోరీలతో జెన్కో యాజమాన్యం సీఈ సమ్మయ్యకు తాజాగా మెమో జారీ చేసింది.
రూ.51 వేల విలువైన కలప చోరీ జరిగినట్లు స్టోర్ అధికారులు ఏప్రిల్ 24న పాల్వంచ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాస్తవంగా ఆ సరకు విలువ రూ.2 లక్షలపైనే ఉంటుందని విశ్వసనీయ సమాచారం. దీనిపై పోలీసులు దఫదఫాలుగా రహస్య దర్యాపు చేస్తున్నారు. కేటీపీఎస్ ఉద్యోగుల్ని, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) ఉన్నతాధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
విచారణ ఎదుర్కొంటున్న వారిలో ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, ఎస్సై, ఐదుగురు కానిస్టేబుల్స్, నాలుగో తరగతి ఉద్యోగి, కలపను తరలించిన ట్రాక్టర్ యాజమాని, కార్పెంటర్ ఉన్నారు. ఇప్పటికే అసిస్టెంట్ కమాండెంట్, ఎస్సై మెడికల్ లీవ్‌పై వెళ్లారు. కానిస్టేబుల్స్‌ను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ పరిణామాల్లో చివరగా చీఫ్ ఇంజినీర్‌కు మెమో జారీ అయ్యింది. కలప కేసు బాధ్యులను త్వరలో రిమాండ్‌కు పంపేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
రూ.35 లక్షల సొత్తు ఎక్కడిది?
కేటీపీఎస్ కాంప్లెక్స్‌లోని వివిధ దశలకు సంబంధించిన ఇనుము, రాగి, అల్యూమినియం, స్టీల్ ప్లేట్లు ఇతర సామగ్రిని పట్టణంలోని పలు ఇనుప దుకాణాల నుంచి ఇటీవల పాల్వంచ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.35 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇది ఏ దశలోని ఏఏ స్టోర్ల నుంచి బయటకు వచ్చిందో నిర్ధారించేందుకు కేటీపీఎస్ అధికారులు, ఉద్యోగులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎక్కడ తాము విచారణలు, కేసులు, శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడటమే ఇందుక్కారణంగా తెలుస్తోంది.
గుట్టును రట్టు చేసేందుకు జెన్కో విజిలెన్స్ అధికారులు ఎస్పీ ఆధ్వర్యంలో లోతైన విచారణను కొనసాగిస్తున్నారు. గతంలో ఓఅండ్‌ఎం కర్మాగారం నుంచి ఇనుప పైపులు తరలించిన కేసుపైనా దృష్టిసారించారు. అసలు బాధ్యులు తమ తప్పిదాల్ని ఎప్పటికైనా అంగీకరించక తప్పదని, లేదంటే లోతైన విచారణలోనైనా అన్నీ బయటపడతాయని కేటీపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.