Special School for Physically Disabled Children in Bhadrachalam: పుట్టుకతో వివిధ లోపాలతో జన్మించే వారు.. ఇతర పిల్లల్లా ఆడుకోవడం, చదువుకోవటం చేయలేరు. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఇంట్లోనే నేర్పించడం కానీ.. శిక్షణ ఇప్పించడం చేస్తే కానీ వాళ్లు చదువుకోలేరు. ఇలాంటి పిల్లలకు సాధారణ పాఠశాలల్లో చదువు చెప్పడం అంత సులభం కాదు. ఉపాధ్యాయులకు సవాలుగా మారుతుంది.
అయితే.. ఇలాంటి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పాలిట వరంగా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలోని వికాస ప్రత్యేక బాలల పాఠశాల. పుట్టుకతో వైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడంతో పాటు వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించడానికి తగిన శిక్షణ ఇస్తోంది. వారికి అన్ని విధాలా అండగా ఉంటూ విద్యా బుద్ధులు నేర్పుతుంది. ఈ పాఠశాల 2002 ఏప్రిల్‌లో ప్రారంభమైంది. ఇక్కడ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివే 30 మంది విద్యార్థులు ఉన్నారు. దీన్ని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) ద్వారా ఏర్పాటు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కలిపి ఈ స్కూలులో మాత్రమే ఇలాంటి ప్రత్యేక బోధన అందిస్తున్నారు. ఇందులో వారికి కావాల్సిన నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు అక్కడి ఉపాధ్యాయులు.
సైగలతో పాఠాలు : ఈ పాఠశాలలో మూగ, చెవిటి, అంధ విద్యార్థులు.. వారి లోపాలను అనుసరించి ఎలా చెబితే అర్థం చేసుకుంటారో.. ఆ విధంగా విద్యా భోధన చేస్తారు. తద్వారా వారు ఇతర విద్యార్థులతో పోటీ పడేలా తీర్చి దిద్దుతారు. ఎక్కువ మంది చెవిటి వారు మూగవారే కావటంతో.. సైగల ద్వారా నేర్పిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి సైగలు చేస్తే అక్షరాలు అర్థమవుతాయో.. మళ్లీ ఆ అక్షరాలు ఎలా గుర్తు పెట్టుకుంటారు అని వారి సామర్థ్యాన్ని బట్టి ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అంధులకు బ్రెయిలీ లిపి ద్వారా పాఠాలు చెబుతున్నారు.
ఆత్మన్యూనతా భావం, భయం పోగొట్టేలా బోధన: సాధారణంగా ఇలాంటి వారికి చదువు చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని కానీ, దాన్ని ఇష్టంగా చేస్తామంటున్నారు ఇక్కడ బోధించే ఉపాధ్యాయులు. పిల్లల్లో ఉన్న ఆత్మన్యూనతా భావం, భయాన్ని పోగోట్టి సాధారణ విద్యార్థులతో పోటీ పడేలా తయారు చేయడం తమ కర్తవ్యం అంటున్నారు. విద్యతోపాటు ఆటలు, పాటలు, డాన్సులు నేర్పిస్తామని చెబుతున్నారు. అంతేకాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రదర్శనలు ఇవ్వటానికి పిల్లలను పంపిస్తామని, ఇలా ప్రదర్శనలు ఇవ్వటం వల్ల ఇప్పటికే అనేక బహుమతులు వచ్చాయని వారు తెలిపారు.
ఈ పిల్లలకు విద్యను నేర్పడానికి హైదరాబాదులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు వివరించారు. తక్కువ జీతాలతో ఇక్కడ పనిచేస్తున్నామని ప్రభుత్వం గుర్తించి తమకు జీతాలు పెంచాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: