TUBE English Channel in YouTube : నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన భూక్యా గౌతమిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తండ్రి తాపీ మేస్త్రీ కాగా.. తల్లి గృహిణి. డాక్టర్ కావాలనుకున్న గౌతమిని.. కుటుంబ ఆచారాల కారణంగా.. సీతంపేట గ్రామానికి చెందిన మాలోత్ కోటేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు. భర్త ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు కావడంతో.. చదువుపై గౌతమికి ఉన్న ఇష్టాన్ని గుర్తించి చదివించారు. సార్వత్రిక విద్యలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. ఖమ్మంలోని కాకతీయ విశ్వ విద్యాలయంలో తనకిష్టమైన ఆంగ్లంలో పీజీ చదివారు.
Tube English channel Teacher interview : అనంతరం బీఈడీ చదివి.. 2013 డీఏస్సీలో జనరల్ కేటగిరిలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. నిరంతర శ్రమతో ఆంగ్ల భాషలో పట్టుసాధించిన గౌతమి.. వినూత్న పద్దతులతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. సాఫీగా సాగుతున్న ఆమె ఉపాధ్యాయ వృత్తిలో 2020లో అనుకోని మలుపు వచ్చింది. కరోనా కారణంగా నెలల తరబడి పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ తరగతుల విధానం అందుబాటులోకి వచ్చింది.
''మా నాన్న తాపీ మేస్త్రీగా పని చేసేవారు. నాకు చిన్నప్పుడే పెళ్లి జరిగింది. నా భర్త టీచర్. ఆయన సహాయంతో నేను చదువుకొని ఇప్పుడు ఒక టీచర్‌గా ఎదిగాను. కరోనా సమయంలో స్కూల్ పిల్లల కోసం జూమ్ క్లాసులు ప్రారంభించాను. విద్యార్థుల వద్ద మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల క్లాసులు వినలేకపోయేవారు.'' - గౌతమి, ఉపాధ్యాయురాలు
గౌతమి బోధిస్తున్న పాఠశాల అటవీ ప్రాంతంలో ఉండటంతో.. సిగ్నల్ సరిగ్గా ఉండకపోయేది. అక్కడి విద్యార్థులకు చదువు చెప్పడం ఆమెకు పెద్ద సవాల్‌గా మారింది. ఎలాగైనా పిల్లలకు పాఠాలు బోధించాలనుకున్న గౌతమి.. తమ కుమారుడి సాయంతో ట్యూబ్ ఇంగ్లీష్ పేరుతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది. తన ఇంగ్లీష్ తరగతులతో విద్యార్థుల్ని మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు.
''పేద స్కూల్ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పడమే లక్షంగా ట్యూబ్ ఇంగ్లీష్ పేరుతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. దీనికి 6 లక్షల 24వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు. అందరూ సులువుగా ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా ఇంగ్లీష్ వీడియోలు పెట్టాను. ప్రాథమిక దశ నుంచీ నేర్చుకునే వాళ్లకు జీరో టు హీరో పేరుతో 11 వీడియోల సిరీస్, అన్ని వర్గాల వారికీ ఉపయోగపడేలా 45 భాగాల స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలు చేశాను.''-గౌతమి
ఇటీవల స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాన్ని ఆమే స్వయంగా రాసి ప్రచురించారు. ఆ పుస్తకాలను పేద పిల్లలకు ఉచితంగా అందజేస్తున్నారు. అనేక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో.. ఇంగ్లీష్ పట్ల భయాన్ని పోగొడుతున్నారు. పేదరికంలో పుట్టినా.. చదువుకునే వయస్సులో వివాహం జరిపించినా.. ఎన్ని అవరోధాలు ఎదురైనా తనకు ఇష్టమైన చదువును కొనసాగించడమే కాకుండా.. మంచి ఉపాధ్యాయురాలిగా రాణిస్తూ.. ఎంతో మంది పేద పిల్లలకు విద్యను అందిస్తున్న గౌతమి టీచర్.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.