భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో పట్టణంగా పేరుగాంచింది మణుగూరు. 20 వార్డులు, 32,065 మంది పట్టణ జనాభా కలిగిన మణుగూరు మున్సిపాలిటీ కార్యాలయం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇంత ముఖ్యమైన మున్సిపాలిటీ భవనం శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడిపోతూ.. నీళ్లు కారిపోతున్న భవనంలో బిక్కుబిక్కుమంటూ అధికారులు, సిబ్బంది దినదిన గండంగా విధులు నిర్వహిస్తున్నారు. రెండు పడక గదుల కంటే చిన్నగా ఉన్న కార్యాలయంలో ప్రజలు, అధికారుల ఇబ్బందులు వర్ణణాతీతం.
ఇరుకు గదుల్లో ఇక్కట్లు
1995లో మణుగూరు గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించారు. తర్వాత 2005లో మణుగూరు పంచాయతీని మున్సిపాలిటీగా మార్చారు. అప్పటి నుంచి ఈ కార్యలయంలోన్నే మున్సిపాలిటీ భవనంగా వినియోగిస్తున్నారు. ఉన్న చిన్నపాటి రెండుగదుల్లో ఒకదానిలో మున్సిపల్ కమిషనర్‌కు కేటాయించారు. రెండోదానిలో కంప్యూటర్ కార్యాలయం, మేనేజరు శానిటరీ విభాగం ఉంచారు. అవసర రీత్యా ఎవరైనా వచ్చారంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చి నిల్చుని తమ సమస్యను విన్నవించుకోవాల్సిందే.
వర్షమొస్తే జలమయమే...
పురపాలకభవనం స్లాబుపెచ్చులూడి ప్రమాదకరంగా ఉంది. వర్షమొస్తే నీరు దారలుగా పడుతోంది. కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు, బీరువాలు తడిచిపోతున్నాయి. సిబ్బంది విధులు మానుకుని వస్తువులపై కవర్లు కప్పుకోవాల్సిందే.
స్థలం కొరతతో తీరని కల
ప్రస్తుత కార్యాలయం ప్రదేశంలో మార్కెట్‌యార్డ్ ఏర్పాటు చేసి నూతన కార్యాలయం వేరేచోట నిర్మించాలని అధికారులు భావించినప్పటకీ స్థలం కేటాయింపులో రెవెన్యూశాఖ తాత్సారం చేస్తోంది. పట్టణ జనాభా కనుగుణంగా కార్యాలయం లేకపోవడం వల్ల ప్రజలు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని సమస్యలు చాలవన్నట్లు పురపాలక కార్యాలయంలో పాములు సంచారం మొదలయింది.
కొత్త భవనం కోసం మూడేళ్ల కిందట ప్రతిపాదనలు
నూతన కార్యాలయ నిర్మాణం కోసం కోటి 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దానికి తగిన డిజైన్‌ను కూడా రూపొందించారు. కార్యాలయ నిర్మాణానికి నిధులతో పాటు స్థలాన్ని కూడా మంజూరు చేయాలని అధికారులు, ప్రజలు కోరుతున్నారు.