భారతదేశంలో రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నేడు సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతోంది. ప్రతి ఏటా ఈ ఉత్సవం వచ్చిందంటే ఆలయ ప్రాంతాలన్నీ వేలాదిమంది భక్తులతో కిటకిటలాడేవి. ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్ కారణంగా ఆలయ ప్రాంగణాలన్నీ బోసిపోయాయి. ఎక్కడ చూసినా నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది.
ప్రతి ఏడాది కల్యాణం నిర్వహించే మిధిలా ప్రాంగణం భక్తులు లేక వెలవెలబోతోంది. భద్రాద్రి రామయ్య కల్యాణం భక్తులు ఎవరూ లేకుండా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ఆలయ పరిసర ప్రాంతాల వద్దకు భక్తులను అనుమతించడం లేదు. ఫలితంగా భక్తులు లేక ఆలయ ప్రాంగణాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
మరోవైపు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నందున భక్తులంతా ప్రసార మాధ్యమాల ద్వారా కల్యాణాన్ని తిలకించాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు.
ఇదీ చూడండి: ప్రైవేట్ ఆస్పత్రుల సేవలను ఏ విధంగా వాడుతున్నారు: హైకోర్టు