ఉపాధి శిక్షణతో కుటుంబాలకు ఆసరా మహిళలు వంటింటికే పరిమితం కాదని... తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తామని చాటిచెప్తున్నారు ఖమ్మం జిల్లా పడతులు. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూనే ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. ఇందుకోసం అందివచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటూ ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. మధిరలోని ఉచిత శిక్షణ కేంద్రం ద్వారా చేతివృత్తులు నేర్చుకొని వాటితోనే ఉపాధి పొందుతున్నారు ఈ మహిళలు.కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే దిశగా చేపట్టిన శ్రీ విద్య ఉచిత శిక్షణ కేంద్రం ఎంతో మందికి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే యువతులు, మహిళలు కుట్టుమిషన్, బ్యుటీషియన్, కంప్యూటర్ విభాగాల్లో శిక్షణ పొందుతున్నారు. ఇందులో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు వరకు హాజరవుతున్నారు. ప్రతిరోజు రెండు గంటల చొప్పున విడతలవారీగా అందించే ఈ శిక్షణలో వందలాది మంది నైపుణ్యం సాధిస్తున్నారు.
కుట్లు, బ్యుటీషియన్ కోర్సుల్లో శిక్షణ పొందినవారు స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంట్లో పనులు చేసుకుంటూనే టైలర్ షాప్లు, బ్యుటీ పార్లర్లు నడుపుతున్నారు. సుమారుగా నెలకు 15 వేల నుంచి 20 వేల సంపాదిస్తూ... కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతీయవకులకు ఈ ఉచిత శిక్షణ చాలా ఉపయోగపడుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: జ్ఞానపీఠ్ గ్రహీత,నటుడు గిరీష్ కర్నాడ్ మృతి