రానున్న కాలంలో తెలంగాణలో తెరాస పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు అన్ని మండలాల్లో పార్టీ కార్యాలయాలుండాలనే ఉద్దేశంతో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో తెరాస పార్టీ కార్యాలయాన్ని రేగా కాంతారావు ప్రారంభించారు. సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లోనూ తెరాసయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంతారావు... ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు. కరోనా వంటి ఆపత్కాలంలో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి అండగా ఉండాల్సిందిపోయి... పనికిరాని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.