లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపునకు గురైన ప్రజలకు రెండు నెలల రేషన్ ఉచితంగా ఇవ్వాలని... బలహీనంగా ఉన్న ఇళ్లకు బదులు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వరద నీటిలో మునిగిన పీఎంసీ కాలనీలో తమ్మినేని పర్యటించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి, వసతి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఏటా గోదావరి వరదల సమయంలో బోట్లు, హెలికాప్టర్లు ఉండేవని.... ఈ ఏడాది అధికారులు ఎవరూ పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని తమ్మినేని మండిపడ్డారు. ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల రాత్రికి రాత్రి వరద నీరు రావటంతో తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఇంత జరిగినా... తహసీల్దార్ ఇప్పటివరకు ఈ ప్రాంతానికి వచ్చి ఆస్తి నష్టాన్ని అంచనా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.