జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే 5వ గనిలో హాలర్ ఆపరేటర్ లక్క లింగయ్య హత్యకు గురయ్యాడు. మృతుడికి భార్య సరోజన, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భూపాలపల్లి కృష్ణా కాలనీ టీ2 టైప్ క్వార్టర్స్‌లో నివాసముండే లింగయ్య ఉదయం చనిపోయినట్లు మృతుడి కుమార్తె సునంద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తరుచుగా భార్యపై దాడి..
లక్క లింగయ్య మద్యపానానికి బానిసై తరచుగా భార్య సరోజనను కొట్టేవాడని.. గతంలోనూ దాడి చేస్తే రెండు చేతులు విరిగినట్లు మృతుడి కుమార్తె పేర్కొన్నట్లు సీఐ వాసుదేవరరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో మృతుడి కుమారులు, కోడళ్లతో కలిసి గురువారం భూపాలపల్లికి వచ్చిన క్రమంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.
వారిని ఊరికి పంపించి..
చిన్న కుమారుడు, ఇద్దరు కోడళ్లు ఊరికి తిరిగి వెళ్లిన క్రమంలో భార్య, పెద్ద కుమారుడు కిరణ్ కలిసి అర్ధరాత్రి సుమారు 11 గంటల సమయంలో రోకలి బండతో లింగయ్య తలపై బలంగా దాడి చేశారు. స్ప్రృహ తప్పిన బాధితుడు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం వల్ల నీటిలో ఎలుకల మందు కలిపి తాగించారని సీఐ వివరించారు.
సోదరికి ఫోన్..
చనిపోయాడని నిర్ధారించుకున్నాక కిరణ్, తన సోదరుడికి, చెల్లెలికి ఫోన్ చేసి విషయం చెప్పినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. మృతుడి కూతురు మంద మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.