డెబ్బై తొమ్మిది రోజుల నిరీక్షణ తర్వాత భద్రాద్రి ఆలయం భక్తులకు ప్రవేశం కల్పిస్తోంది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు కదిలి వచ్చారు. కరోనా నివారణలో భాగంగా ఆలయ అధికారులు భౌతిక దూరం పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు అనుమతిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆరున్నర నుంచే స్వామివారి దర్శనానికి ప్రవేశం కల్పించారు. భక్తులు విధిగా నిబంధనలు పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రతి భక్తుడికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. క్యూలైన్లలో శానిటైజర్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి మధ్య ఆరడుగుల దూరం ఉండేలా వృత్తాలు గీశారు. అంతరాయ ప్రవేశం, శఠగోపం, తీర్థ వినియోగం ఆపివేశారు. భక్తులకు వసతి గదులు ఇవ్వటాన్ని నిలిపివేశారు. 10 ఏళ్ల లోపు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గర్భిణీలను ఆలయానికి అనుమతించడం లేదు. ప్రతి పది నిమిషాలకు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో పిచికారీ చేస్తున్నారు. గోదావరి కరకట్ట వద్ద గల కళ్యాణ కట్టలో తలనీలాల సమర్పణ నిలిపివేశారు. భక్తులు అందరూ విధిగా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని ఈవో నరసింహులు సూచించారు.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు- మాస్కులతో భక్తులు