Mirchi farmers problems:రాష్ట్రంలో మిర్చి రైతులపై దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఈ సారి సీజన్ ఆరంభం నుంచే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న రైతులు..చివరకు పంట అమ్ముకునే సమయంలోనూ అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి సాగుదారుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈసీజన్‌లో ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాల్లో, భద్రాద్రి జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగుచేశారు. అయితే..ఈ సారి సీజన్ పొడవునా రైతులు కఠిన పరీక్షలే ఎదుర్కొన్నారు.
పూత, కాత దశ వరకూ రైతుల్ని ఊరించిన మిర్చి పంటపై ఒక్కసారిగా తెగుళ్ల దాడి ప్రారంభమైంది. కాయకుళ్లు తెగులు, జెమిని వైరస్, క్రింది ముడత, పై ముడత, లద్దెపురుగు, కొమ్మకుళ్ళు, కాయకళ్లు, ఎండు తెగులు మిర్చి పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. తర్వాత తామర పురుగు ఉద్ధృతి మిర్చి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
Mirchi farmers problems:పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు రకరకాల పురుగు మందులను పిచికారీ చేశారు. దీంతో పెట్టుబడి పెరిగింది. డిసెంబర్ మూడో వారం నుంచి మిరప కోతలు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో ఎకరాకు 2-3 క్వింటాళ్ల దిగుబడి కష్టంగా వస్తుంటే ఇందులో సగం తాలు కాయలే రావడం రైతుల్ని కోలుకోలేని దెబ్బ తీసింది.ఈక్రమంలో కురిసిన అకాల వర్షాలు మిర్చి రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి.
Mirchi farmers problems in khammam: ఖమ్మం జిల్లాలో సుమారు 85 వేల క్వింటాళ్లు, కొత్తగూడెం జిల్లాలో 15 వేల క్వింటాళ్ల మిర్చి కల్లాల్లో ఆరబెట్టగా ఇటీవలి వర్షాలకు మిర్చి మొత్తం తడిసిపోయింది. ఫలితంగా మార్కెట్‌లో మిర్చి ధర 15 వేల 500 ఉన్నప్పటికీ...వ్యాపారులు మాత్రం 13 వేలకు మించి ధరలు పెట్టడం లేదు. మిర్చి తెల్లపొర మచ్చలు ఉన్నాయంటూ కొర్రీలు పెడుతూ అగ్గువకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మిర్చి రైతులు దీనంగా వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: