భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఈరోజు ఉదయం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు పెరగగా... కలెక్టర్ ఎంవీ రెడ్డి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా... ఉదయం 10 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 44.8 అడుగులకు చేరింది. నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
గోదావరి నీటిమట్టం పెరగడం వల్ల దుమ్ముగూడెం మండలం లక్ష్మినగరం వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి దిగువ ప్రాంతంలో ఉన్న విలీన మండలాలైన కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాలకు వెళ్లే రహదారి వద్దకు ఇరువైపుల వరద నీరు చేరింది.
తాలిపేరు గేట్లు ఎత్తివేత..
గోదావరి ఎగువ ప్రాంతమైన చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు చేరగా... మొత్తం 23 గేట్లను వదిలి లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు వాగులు, వంకలు పొంగి భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.