భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి సమీపంలో సీతారామ కాలువలో పడి ఓ మేకల కాపరి మరణించాడు. గుండెపూడిలో ఓ రైతు వద్ద పనిచేస్తున్న రామకృష్ణ మేకలు కాసేందుకు సీతారామ ప్రాజెక్టు కాల్వ వైపు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడిన ఆ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా కట్టలు వేయడం వల్ల నీళ్లు నిలిచాయని.. అందువల్లే రామకృష్ణ మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు.
సీతారామ ప్రాజెక్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్ల మృతదేహంతో జూలూరుపాడులోని ఆ శాఖ కార్యాలయం వద్దకు వెళ్లి రాస్తారోకో చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే యువకుడు మరణించాడని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న జూలురుపాడు సీఐ నాగరాజు సంఘటనాస్థలానికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సీతారామ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పగా ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి : రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి