Prasadam Scam In Bhadradri: ప్రసాదం... ఈ పేరు వినగానే భక్తి భావంతో పాటు.. నోట్లో లాలాజలం ఊరుతుంది. ప్రతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో లభించే ప్రసాదానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అందువల్లే ఎవరైనా తీర్థయాత్రకు వెళ్తుంటే.. ఏం తీసుకురాకపోయిన పర్వాలేదు.. కాస్త ప్రసాదం తీసుకురమ్మని చెబుతారు. ప్రసాదాన్ని దైవ అనుగ్రహం పొందినది భావిస్తారు. ఆ ఆహారాన్ని కూడా దైవంగానే భావిస్తారు. ఇంతటి ప్రాశస్త్యం ఉంది కనుకనే.. దానిని పరిమితంగా తీసుకోవాలి అంటారు. దైవ ప్రసాదం ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ పంచాలి అంటారు. కానీ భద్రాద్రి రామయ్య సన్నిధిలో స్వామివారి ప్రసాదం భక్తులకు అందకుండా పోతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాద్రిపై ప్రసాదం పక్కదారి పడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులకు పంపిణీ చేయాల్సి పులిహోర, చక్కెర పొంగలి... ఆలయ వంటశాల సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. కోదండరామయ్య సన్నిధిలో పులిహోర ప్రసాదానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో పులిహోర ప్రసాదం చాలా రుచిగా ఉంటుందని ప్రతీతి. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు క్యూలైన్లలో నిలబడి మరీ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అయితే గత కొంతకాలంగా ప్రసాదం పంపిణీలో నిర్లక్ష్యం జరుగుతోంది. భక్తులకు పంపిణీ చేసే ప్రసాదం... కొంతసేపటికే అయిపోతుంది. భక్తులు అడిగితే ప్రసాదం అయిపోయిందని.. తీర్థం పోస్తున్నారు. స్వామివారి క్షేత్రంలో.. స్వామివారికి ప్రీతిపాత్రమైన ప్రసాదం.. తమకు దక్కకపోవడంతో భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ ప్రసాదం ప్రైవేటు వ్యక్తుల ద్వారా పక్కదారిన మళ్లిస్తున్నారనే ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి.
ఇదిగో ఇలా వెళ్లిపోతుంది..
ఆదివారం ఉదయం సమయంలో ఓ వ్యక్తి సుమారు పది కిలోల చక్కెర పొంగలి, పులిహోర ప్రసాదాన్ని తీసుకెళ్తున్నదృశ్యం ఈటీవీ భారత్ కెమెరా కంటపడింది. ఇంత ప్రసాదం ఎవరిచ్చారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా.. వంటశాల సిబ్బందికి వెయ్యిరూపాయలు చెల్లించి తీసుకెళ్తున్నట్లు ఆ వ్యక్తి చెప్పాడు. అయితే ఇవాళ ఉదయం 10గంటల వరకు ప్రసాదానికి సంబంధించి డబ్బులు చెల్లించి రశీదు తీసుకోలేదని ప్రసాదం కౌంటర్ సిబ్బంది తెలిపారు. దీనిని బట్టి ప్రసాదం కోసం కౌంటర్లో డబ్బులు చెల్లించకుండానే.. ఆలయ వంటశాల సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ప్రసాదాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు తేటతెల్లమైంది.
గంట తర్వాత టిక్కెట్టు సృష్టించారు.. అదెలా అబ్బా...
భక్తులకు పంచాల్సిన ప్రసాదం పక్కదారి పట్టడంతో క్యూలైన్లో వేచి చూసినవారికి ప్రసాదం అందడం లేదు. ఇవన్నీ పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు అండదండలతోనే ప్రసాదం భక్తుల చెంతకు చేరడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం ఈ తతంగం జరిగిన గంట సేపటికి కౌంటర్లో రూ.900 చెల్లించి ప్రసాదం కోసం టికెట్టు పొందినట్లు ఆలయ అధికారులు సృష్టించారు.
ప్రసాదం పెద్దమొత్తంలో అమ్ముతారా..
ఆలయాల్లో ప్రసాదం పెద్ద మొత్తంలో కావాలనుకునేవారికి పంపిణీ చేస్తారు. కాకపోతే ఎంత మొత్తంలో కావాలో దానికి తగిన ధర చెల్లించి రశీదు పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రసాదం తయారు చేసి పంపిణీ చేస్తారు. భద్రాచలంలో కిలో పులిహోర ప్రసాదం రూ. 150, చక్కెర పొంగలి రూ. 300కు విక్రయిస్తారు. కావాలనుకునేవారు ముందుగా టిక్కెట్టు తీసుకుని రశీదు పొందాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి : Couple Cheating: 'నమ్మకంగా ఉంటూ మమ్మల్ని నట్టేట ముంచారు.. న్యాయం చేయండి'